స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌కుమార్‌ నామినేషన్‌

తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పాల్గొన్నారు. వారితో పాటు ఎమ్మెల్యేలు కెటిఆర్, కూనంనేని సాంబశివరావు, హరీశ్ రావు కూడా హాజరయ్యారు.
 
కాగా, స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బీఆర్ఎస్ పార్టీ అధినేత , పార్టీ శాసన సభానేత కేసీఆర్‌ను కోరడం, వారు సమ్మతించటం మరోవైపు ఎంఐఎం నేత పార్టీ సైతం మద్దతు ఇస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.
సభాపతిగా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఏకగ్రీవ ఎన్నికకు బిఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ పార్టీ మద్దతు ఇచ్చాయి.
ఈ క్రమంలో ప్రసాద్‌ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్‌పై కెటిఆర్ సంతకం చేశారు. అయితే ఈ ఎన్నికకు బిజెపి మాత్రం దూరంగా ఉంది. గురువారం ఉదయం శాసనసభాపతి ఎన్నిక జరగనుంది. ప్రసాద్ కుమార్ ప్రస్తుతం వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పాలనలో దళితులకు పెద్దపీట వేస్తున్నామనే నేపథ్యంలోనే గడ్డం ప్రసాద్‌ కుమార్​ను స్పీకర్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. సభాపతిగా నియమితులైతే రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్‌ ఆయనే కానున్నారు.