టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామాను తిరస్కరించిన గవర్నర్

టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ తిరస్కరించారు.  సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జనార్థన్ రెడ్డి సమావేశమైన తరువాత కొద్దిసేపటికే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.  అయితే, రాజీనామాను ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. 
 
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్నారని వివరించాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ నిర్వహణలో జరిగిన అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాల్సి ఉందని, ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసులు దర్యాప్తు దశలో ఉన్నందున కమిషన్ ఛైర్మన్ రాజీనామా అమోదిస్తే అసలు దోషులు తప్పించుకునే అవకాశం ఉంటుందని గవర్నర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 
 
పేపర్ లీక్ అంశంలో బాధ్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిఓపిటికి గవర్నర్‌ లేఖ రాశారు. మరోపు మంగళవారం టిఎస్‌పిఎస్పీ‌పై తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో గ్రూప్ -1 సహా పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది. 
 
ప్రభుత్వానికి ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వార్ నడిచింది. ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రెడ్డి రాజీనామా చేయాలని అప్పట్లో ఆందోళనకు కూడా జరిగాయి.  పేపర్ లీకులు అయినప్పుడే నిరుద్యోగుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి గవర్నర్ తమిళసై లేఖ రాశారు.
 
అప్పుడు దానిని డీఓపీటీకి రాష్ట్రపతి అధికారులు పంపించారు. టీఎస్ పీఎస్సీ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని,  ఏం జరిగిందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి నుంచి లేఖ అందింది. కానీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకుండా మౌనంగా ఉండిపోయింది. ఇపుడు ప్రభుత్వం మారగానే టీఎస్ఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌ రెడ్డి రాజీనామా చేయటం కలకలం రేపుతోంది.  
 
ఇప్పటికే కోర్టులో పేపర్ లీకు కేసు ఉంది. అయితే పేపర్ లీకేజీలకు బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామాను ఆమోదించకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆమె న్యాయసలహా తీసుకోవచ్చని కూడా చెబుతున్నారు.