ఏపీకి ముంచుకొస్తున్న మరో తుపాన్

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. ఈ నెల 16న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.ఉపరితల ఆవర్తనం ఈ నెల 18న అల్పపీడనంగా మారనుంది. అల్పపీడనం భారీ తుపాన్‌గా మారి శ్రీలంక, తమిళనాడుతో పాటు ఏపీ వైపు కూడా పయనించే అవకాశం ఉంది.
 
తుపాన్ ప్రభావంతో ఏపీలో ఈ నెల 21 నుంచి 27 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణశాఖ అధికారులు. ఇప్పటికే మిగ్‌జాం తుపాన్‌తో అతలాకుతలమైన ఏపీకి.. మరో తుఫాన్‌ ముపు పొంచి ఉండటంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
మిగ్‌జాం మిగిల్చిన విషాదం మరువక ముందే మరో తుఫాన్‌ ఎఫెక్ట్‌ అనే వార్త రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఇప్పటికే ఏపీలో చేతికొచ్చిన పంట నీటమునిగి రైతులు తీవ్లరంగా నష్ట పోయారు. ఇప్పుడు మరో తుపాన్ ముంచుకొస్తుందనే వార్త అన్నదాతలను భయాందోళనకు గురిచేస్తుంది.

ఏపీకి మరో తుపాన్ ముపు పొంచివుండటంతో అటు అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాన్ ను ఎదుర్కొనేందుకు అధికారయంత్రాంగం చర్యలు చేపట్టింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేస్తున్నారు అధికారులు.

 
కాగా, తుఫాన్‌ వెళ్లి ఐదురోజులైనా చేలలో నీళ్లు కదలకపోవటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంటకోసే అవకాశంలేక పలువురు రైతులు దున్నేస్తున్నారు. 400 ఎకరాల్లో పంట నీటమునిగి రోజులు గడుస్తున్నా నీరుపోయేందుకు అధికారులు ఏవిధమైన చర్యలు చేపట్టకపోవటంతో ధాన్యం మెలకెత్తుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఉపాధి పనుల్లో మురుగు బోదెలు సక్రమంగా తవ్వకాలు జరపలేదని రైతులు విమర్శిస్తున్నారు. వర్షం నీరు చేలలోచురటంతో పంట దక్కే పరిస్థితి లేదని రైతులకు చెబుతున్నారు.

మరోవంక, తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందిస్తామని రైతుల నుంచి ప్రతి గింజా కోనుగోలు చేస్తామని ఇటీవల పర్యటనలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇచ్చిన హామీ ఇంకా ఆచరణలోకి రాలేదు. మిల్లులకు తరలించిన ధాన్యం ఇంకా వాహనాల్లోనే ఉండిపోవడంతో మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.