కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు

ఏపీలో మిగ్ జామ్ తుపాను ప్రభావంతో ఇటీవల భారీ వర్షాలు కురిసి దీంతో రిజర్వాయర్లు నిండడంతో ప్రకాశం జిల్లా మల్లవరం కందుల ఓబుల్ రెడ్డి ప్రాజెక్టు (గుండ్లకమ్మ రిజర్వాయర్‌)కు భారీగా వరద నీరు చేరింది. నీటి ప్రవాహానికి గత ఏడాది 3వ గేటు కొట్టుకుపోయింది. తాజాగా మరో గేటు కొట్టుకుపోయింది. 
 
ఇంకా 3వ గేటు మరమ్మతులే పూర్తి కాలేదని విమర్శలు వస్తున్న సమయంలో మరో గేటు కొట్టుకుపోవడం కలకలం రేపుతోంది. గేట్లు కొట్టుకుపోవడంతో ప్రాజెక్టు దిగువకు నీరు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. నీటి వృథాను అడ్డుకునేందుకు స్టాప్‌లాక్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
 
స్టాప్‌లాక్‌ గేటు ఏర్పాటు సమయంలో హుక్‌ తెగిపోవడంతో నీటి వృథాను ఆపడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. హుక్‌ను బయటకు తీసి స్టాప్‌లాక్‌తో వెల్డింగ్ చేసేందుకు సిబ్బంది లేకపోవడం వల్ల పనులు ఆలస్యం అయ్యాయని తెలుస్తోంది.  గుండ్లకమ్మ ప్రాజెక్టులో ప్రస్తుతం 2.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 
 
అయితే గేట్లు కొట్టుకుపోవడంతో నీరు వృథాగా సముద్రం పాలవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది కొట్టుకుపోయిన 3వ నంబర్ గేటు మరమ్మతులు ఇప్పటి వరకూ పూర్తికాలేదన్న విమర్శలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే మరో గేటు కొట్టుకుపోయిందని రైతులు మండిపడుతున్నారు. 
 
అయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అధికారులు అంటున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా, టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ రిజర్వాయర్ కు నష్టం జరిగిందన్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. డ్యామ్ సేఫ్టీపై టీడీపీ ప్రభుత్వం హయాంలో కమిటీలు నివేదిక ఇచ్చినా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను రిపేర్ చేయలేదని ఆరోపించారు.