దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ మరోసారి ఆందోళన కలిగిస్తోంది.కరోనా కనుమరుగైపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కేసుల పెరుగుదల ఉలిక్కిపడేలా చేస్తోంది. కరోనా గురించి చాలా మంది మర్చిపోతున్న సమయంలో తాజా పరిణామాలు మరోసారి అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. 

భారత్‌లో మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుదల కనిపించింది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 166 కొత్త కేసులు వెలుగుచూశాయి. చాలా రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారత్‌లో ఆదివారం 166 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.

అందులో అత్యధికంగా కేరళలోనే నమోదు కావడం గమనార్హం. తాజా కేసులతో కలిసి దేశంలో మొత్తంగా 895 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  ప్రస్తుతం చలికాలం కావడంతో ఇన్‌ఫ్లూయెంజా వంటి వైరస్‌ల కారణంగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సిమ్లాలోని ఓ ఆసుపత్రిలో ఓ మహిళ కరోనా కారణంగా మృతి చెందడం కలకలం రేపుతోంది.

కరోనా కేసుల పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చలికాలంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.  వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 4.44 కోట్ల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. అందులో 5,33,306 మంది వైరస్‌తో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక ఇప్పటి వరకూ కేంద్రం 220.67 కోట్ల కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసింది.