కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్

కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్ల అవినీతికి ప్రజా ప్రతినిధులే పాల్పడుతున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. 

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహూపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తే రూ. 200 కోట్ల నగదు అధికారికంగా లెక్క తేల్చారని ఆమె గుర్తు చేశారు. అయితే లెక్క తేల్చాల్సిన నగదు ఇంకా ఉందని అధికారులు చెబుతున్న తీరు పరిశీలిస్తే కాంగ్రెస్ ఎంపీల అవినీతి ఎంత అన్నది తేలుతోందని ఆమె ఎద్దేవా చేశారు. 

నాటు సారాతో ఈ సొమ్ము సంపాదించినట్లుగా తెలుస్తోందని చెబుతూ ఇదంతా నల్లధనమే అన్నవిషయం ప్రజలకు అర్ధం అవుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ధీరజ్ సాహూ కుటుంబ సభ్యులపై జరుగుతున్న దాడుల్లో లెక్కకు మించిన నల్లధనం వెలుగు చూస్తోందని చెప్పారు.

ఇండియా కూటమి నాయకుడు మల్లిఖార్జున ఖర్గే బీజేపీని ఓడించడం కోసమే కూటమి అంటున్నారని ఆమె గుర్తు చేశారు. అయితే కూటమిలో ఉన్న అన్ని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని పురందేశ్వరి ఆరోపించారు. బెంగుళూరులో ఒక కాంగ్రెస్ నేత ఇంటిపై దాడులు జరిగితే రూ. 42 కోట్ల నగదును అధికారులు గుర్తించారని ఆమె చెప్పారు.
పశ్చిమ బెంగాల్ లోని చటర్జీ అనే మంత్రి ఇంట్లో రూ.50 కోట్ల నగదు దొరికిందని, ఉత్తర ప్రదేశ్ లో పీయూష్ జైన్ ఇంట్లో రూ.200 కోట్లు లభ్యం అయిన సంఘటన చూశామని పేర్కొంటూ ఇటువంటి అవినీతి పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని పురందేశ్వరి హెచ్చరించారు.