మోదీజీ అనకండి.. మోదీ అంటే చాలు

తన పేరు ముందు ‘ఆదరణీయ’ లేదా ‘మోదీజీ’ వంటి పదాలు జోడించి తనను సంబోధించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ తన సహచర పార్టీ ఎంపీలకు సూచించారు. దేశరాజధానిలో గురువారం జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ తనను `మోదీ’ అని పిలిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.  తన పేరుకు ఇలాంటి గౌరవవాచకాలు జోడిస్తే ప్రజలకు తనకూ మధ్య దూరం పెరుగుతుందని ఆయన చెప్పారు. 

 తాను పార్టీలో ఓ సాధారణ కార్యకర్తనని, ప్రజలు తనను తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారని కూడా మోదీ చెప్పారు. తనను ఎంపీలు తమలో ఒకడిగా భావించాలని ఆయన సూచించారు. ‘‘నేను పార్టీలో ఓ చిన్న కార్యకర్తను. సామాన్యులు నన్ను తమ కుటుంబంలో ఒకడిగా భావిస్తారు. కాబట్టి ‘మోదీజీ ‘ఆదరణీయ’ లాంటి విశేషణాలు నా పేరుకు ముందు చేర్చకండి’’ అని మోదీ తెలిపారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే విజయానికి కారణం అంతా కలిసికట్టుగా పనిచేయడమే అని ప్రధాని స్పష్టం చేశారు. మన సమిష్టిత్వానికి దక్కిన విజయం అని పేర్కొంటూ ప్రజలు బిజెపి పాలనను ఇష్టపడ్డారని, నిర్ణయాలు తీసుకోవడం, అమలుకు దిగడం, పారదర్శకతలకు పట్టం కట్టారని వివరించారు. లేకపోతే ఇంతటి విజయం అసాధ్యం అయి ఉండేదని తెలిపారు. 

ప్రభుత్వపరంగా , పాలనాపరంగా బిజెపి ఎక్కువ మార్కులు సంపాదించుకుందని, పార్టీ పట్ల సహేతుకత ప్రతిఫలించిందిని, ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత తలెత్తలేదని మోదీ స్పష్టం చేశారు. ఎక్కడైతే ఎవరైతే పార్టీకి కోసం తమ జీవితాలు ఫణంగా పెట్టారో, అహర్నిశలూ కృషి చేశారో వారిని విజయం వరించిందని ఆయన తెలిపారు.

బీజేపీకి ఎన్నికల్లో రెండో పర్యాయం విజయం లభించే అవకాశం 59 శాతంగా ఉందని కూడా ప్రధాని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ విషయంలో ఇది 20 శాతంగా, ప్రాంతీయ పార్టీల విషయంలో ఇది 49 శాతంగా ఉందని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సాధారణ ప్రజానీకంలోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ‘వికసిత భారత్ యాత్ర’లో ఎంపీలు కూడా పాల్గొనాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కైవసం చేసుకున్న ఉత్సాహంతో జరిగిన ఈ సమావేశ మందిరానికి ప్రధాని రాగానే పార్టీ ఎంపీలు “మోదీ జీ కా స్వాగ్ హై” అంటూ నినాదాలతో హోరెత్తించారు. 

ఈ సందర్భంగా ఆయనకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పూలమాలతో స్వాగతం పలికారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో ముఖ్యమంత్రుల ఎంపికపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీజేపీ తొలిసారిగా సమావేశం నిర్వహించింది. సభ 4వ రోజు ప్రారంభానికి ముందు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ఈ సమావేశం జరిగింది.