రైతులకు అపార నష్టాన్ని మిగిల్చిన మిచౌంగ్‌ తుపాన్‌

మిచౌంగ్‌ తుపాన్‌ అపార నష్టాన్ని మిగిల్చింది. వరి, శనగ, పెసర, కంది, మొక్కజొన్న, మినప, మిరప, పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పత్తి పూత రాలిపోయింది. పొలాల్లో నీరు నిల్వ ఉండిపోవడంతో పంట ఎందుకూ పనికి రాదని పలువురు రైతులు కన్నీరు మున్నీరయ్యారు. కళ్లాల్లోనూ, రోడ్లపైనా ఆరబోసిన ధాన్యం తడిచి ముద్దవ్వడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 
 
పడిపోయిన పంటలను నెలబెట్టుకొని, తడవగా మిలిగిన ధాన్యాన్ని కాపాడుకొనే పనిలో రైతులు నిమగమయ్యారు. వర్షాలకు తడిచిపోయిన వరి పనులను ఆరబెట్టుకుంటున్నారు. ఆదుకొనే వారి కోసం ఎదురు చేస్తున్నారు. పంట నష్టాల అంచనాల్లో అధికారులు ఉన్నారు. తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. రాష్ట్రంలో తుఫాన్ నేపథ్యంలో తేమతో సంబంధం లేకుండా ధాన్యాన్ని రైతుల నుంచి మిల్లర్లు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
అల్లూరి జిల్లాలో గెడ్డలో ముగ్గురు గిరిజనులు గల్లంతయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పుడు వర్షాలు ప్రారంభమయ్యాయి.  విజయనగరం ఉమ్మడి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వరికి నష్టం వాటిల్లింది. సువర్ణముఖీనది, గోముఖీ నదులు ఉధృతంగా ప్రవహించడంతో వెంగళరాయసాగర్‌ నుంచి నీటిని కిందికి అధికారులు విడుదల చేశారు. మంగళవారం వరకూ కురిసిన భారీ వర్షాలకు ఎన్‌టిఆర్‌ జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో వరి, మినుము, పత్తి , వేరుశనగ వంటి పంటలకు నష్టం వాటిల్లిందని కలెక్టర్‌ తెలిపారు. 
 
మొత్తం 29 సబ్‌ స్టేషన్ల పరిధిలో 199 విద్యుత్‌ స్తంభాలు, 25 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని 52 సంచార బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తక్షణమే దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలను, పరికరాలను పునరుద్ధరించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 
 
పత్తి, మిర్చి, జొన్న, మొక్కజొన్న, శనగ, అపరాలు పొగాకు పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 68,055 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, మినుము, పెసర, వేరుశనగ, పొగాకు, పత్తి పంటలు వీటిలో ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 37,500 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
బాపట్ల జిల్లా నల్లమడ ఎగువ ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షాల వల్ల వరద నీటి ఉధృతికి నల్లమడ వాగుకు రెండు చోట్ల గండ్లు పడ్డాయి. బాపట్ల జిల్లాలో 1.75 లక్షల ఎకరాలలో ధాన్యం నీట మునిగిందని కలెక్టర్‌ రంజిత్‌ బాషా తెలిపారు. నెల్లూరు జిల్లాలో వరి ఆకు, నారు మడుల్లో నీరు నిల్చే ఉండడంతో రైతులు ఆందోళన చెరదుతున్నారు. కాకినాడ జిల్లాలో మొత్తం 33,340 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది.