హిందీ భాషా రాష్ట్రాలను ‘గోమూత్ర’గా పేర్కొన్న డీఎంకే ఎంపీ

ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) ఎంపీ డీఎన్‌వీ సెంథిల్ కుమార్  లోక్‌సభలో మంగళవారంనాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషా రాష్ట్రాలను ‘గోమూత్ర’ రాష్ట్రాలుగా అభివర్ణించారు. ఆ రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని, దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి గెలుపు ఉండదని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ విషయమై పెను దుమారం చెలరేగింది.

తమిళనాడులోని ధర్మపురి లోక్‌సభ నియోజకవర్గానికి సెంథిల్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్‌సభలో జమ్మూ కశ్మీర్ బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందీ భాష మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలుగా అభివర్ణించారు. ఈ రాష్ట్రాల్లోనే బీజేపీ విజయం సాధిస్తుంటుందని తెలిపారు.

హిందీ భాషా రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ద‌క్షిణాది రాష్ట్రాల్లోకి బీజేపీ రాలేదని స్పష్టం చేస్తూ కేర‌ళ‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఏపీ, క‌ర్నాట‌క‌లోస్థానిక పార్టీలే బ‌లంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలంటూ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి మీనాక్షి లేఖ ఖండించారు.  ఎంపీ వ్యాఖ్యలు సమానత ధర్మాన్ని అవమానించడమేనని చెప్పారు. త్వరలోనే డీఎంకేకు గోమూత్రం వల్ల లాభాలు ఏంటో తెలుస్తాయని ధ్వజమెత్తారు. దేశ ప్రజలు ఇలాంటి ద్వేషుల్ని సహించరని, తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు.

కాగా, గోమూత్ర రాష్ట్రాలంటూ డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ కుమార్ రంజన్‌ను మీడియా ప్రశ్నించినప్పుడు, అది వారి వ్యక్తిగత అభిప్రాయమని దాటవేశారు.  పార్లమెంటులో ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పినప్పపుడు దాంతో తమకు సంబంధం ఉండదని పేర్కొంటూ తాము (కాంగ్రెస్) గోమాతను గౌరవిస్తామని చెప్పారు.

తన వాఖ్యలపై దుమారం చెలరేగడంతో సెంథిల్ కుమార్ ఆ తర్వాత దిద్దుబాటు చర్యలకు పాల్పడ్డారు.  ”పార్లమెంటులో నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను. ఆ సమయంలో హోమంత్రి, బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. గతంలో కూడా నేను ఇదే పదాలను పార్లమెంటు ప్రసంగాల్లో వాడాను. అదేమీ వివాదాస్పద ప్రకటన కాదు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇక ముందు ఆ పదం వాడను. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వేరే పదాన్ని వాడతాను” అంటూ ఆయన  వివరణ ఇచ్చుకున్నారు.  డీఎంకే నేతలు సున్నిత్వాన్ని మరచిపోయి అహంకారంతో ఇటువంటి వాఖ్యలు చేస్తున్నారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే..ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన డిఎంకె ఎంపి వ్యాఖ్యలను అదే కూటమిలోని కాంగ్రెస్ ఎంపి ఒకరు ఖండించడం విశేషం. డిఎంకె ఎంపి సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను పార్లమెంటరీ భాషకు విరుద్ధమంటూ కాంగ్రెస్ ఎంపి కార్తి చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు. సెంథిల్ వాడిన పదాలు అత్యంత దురదృష్టకరమని, తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పడంతోపాటు వాటిని ఉపసంహరించుకోవాలని ఎక్స్ వేదికగా కార్తి చిదంబరం సూచించారు.

ఇప్పటికే డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే కోర్టుల్లో పలు కేసులు నడుస్తున్నాయి. అలాగే ఉదయనిధి స్టాలిన్ వాఖ్యలు ఇటీవల మూడు హిందీ రాష్ట్రాల్లో బిజెపికి ప్రధాన ప్రచార అస్త్రంగా నిలిచాయి. కాంగ్రెస్ ఓటమికి ఇదొక్క ప్రధాన కారణమని ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు.