కర్నిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్‌‌ దారుణ హత్య

రాష్ట్రీయ రాజ్‌పుత్ క‌ర్ణిసేన అధ్య‌క్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. జైపూర్‌లోని త‌న నివాసంలో ఉన్న సుఖ్‌దేవ్ సింగ్‌పై ఇద్ద‌రు దుండ‌గులు బైక్‌పై వ‌చ్చి తుపాకీతో కాల్పులు జ‌రిపారు. అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు సుఖ్‌దేవ్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

సుఖ్‌దేవ్ ఇద్ద‌రు అనుచ‌రుల‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిద్ద‌రిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో అక్క‌డే ఉన్న గార్డ్ అజిత్ సింగ్ దుండ‌గుల కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఐసీయూలో ఉన్న అజిత్ సింగ్ ఆరోగ్య ప‌రిస్ధితి విష‌మంగా ఉంది. కాల్పుల ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు.

జైపూర్‌లోని త‌న నివాసంలో ఇద్దరు అనుచరులతో కలిసి ఉన్న సుఖ్‌దేవ్ సింగ్‌పై బైకు మీద వచ్చిన ఇద్దరు దుండ‌గులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మాట్లాడుతున్నట్లుగా నమ్మించి అకస్మాత్తుగా దాడి చేశారు. విశ్వసనీయ వర్గాల కథన ప్రకారం, సుఖదేవ్ సింగ్‌ను చంపుతామంటూ గతంలో లారెన్స్ విష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సంపత్ నెహ్రూ నుంచి పోలీసులకు బెదరింపు కాల్స్ వచ్చాయి. 

ఘటన జరిగిన వెంటనే భారీగా పోలీసులు బలగాలను శ్యామ్‌నగర్ ప్రాంతంలో మోహరించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. గన్‌మెన్ నరేంద్రపై కూడా దుండగులు కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. అయితే సుఖ్‌దేవ్ సింగ్‌పై అగంతకులు ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రీయ కర్ని సేనతో చాలాకాలంగా సుఖ్‌దేవ్ సింగ్‌కు అనుబంధం ఉంది. కొద్దికాలం క్రితం కర్నిసేనతో విభేదాలు రావడంతో ఆయన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ని సేన పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేశారు.

 బాలీవుడ్ చిత్రం పద్మావత్, గ్యాంగ్‌స్టర్ ఆనంద్ పాల్ ఎన్‌కౌంటర్ కేసు తర్వాత రాజస్థాన్‌లో జరిగిన పలు ధర్నాలతో ఆయన పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ అంశాలకు సంబంధించిన పలు వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇలా ఉండగా, సుఖ్‌దేవ్ సింగ్‌పై కాల్పుల ఘ‌ట‌న‌కు తామే బాధ్యుల‌మ‌ని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స‌భ్యుడు రోహిత్ గొదారా ప్ర‌క‌టించారు. క‌ర్ణి సేన చీఫ్ హ‌త్య‌కు త‌మ గ్యాంగ్‌దే పూర్తి బాధ్య‌త‌ని రోహిత్ గొదారా ఫేస్‌బుక్ వేదిక‌గా వెల్ల‌డించారు.

మరోవైపు, సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడిని ఆగంతకులు కాల్చిచంపిన ఘటనపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీస్ కమిషనర్‌ను కోరినట్టు చెప్పారు. 

ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, బీజేపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే రాష్ట్రాన్ని నేరాల నుంచి విముక్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. సుఖ్‌దేవ్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు భగవంతుడు ఆత్మనిబ్బరం కలిగించాలని కోరుకుంటున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.