బాపట్ల వద్ద తీరం దాటిన తుఫాన్‌.. జనజీవనం అస్తవ్యస్తం

మిచౌంగ్‌ తుఫాన్‌ కోస్తాంధ్రను అతలాకుతలం చేసింది. మూడు రోజులుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన తుఫాన్‌… తీరం దాటే వేళ పెను విధ్వంసాన్నే సృష్టించింది. తుఫాన్‌ ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు 3 మీటర్ల మేర ఎగిసిపడ్డాయి. దాదాపు 50 అడుగుల మేర సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది.

భారీ వర్షాలు, ఈదురు గాలులతో కోస్తా జిల్లాలు చిగురుటాకులా వణికాయి. మంగళవారం మధ్యాహ్నం 12.55 గంటలకు బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన తుఫాన్‌… సాయంత్రం 4 గంటల సమయంలో తీరాన్ని పూర్తిగా దాటినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.  పెనుగాలులకు వర్షాలు తోడవడంతో మిచౌంగ్‌ ప్రళయాన్ని తలపించింది.

ఇప్పటికే తమిళనాడులో జల విలయానికి కారణమైన తుఫాన్‌ ఏపీలోనూ బీభత్సం సృష్టించింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అటు రాయలసీమ ప్రాంతంలోనూ, ఇటు తెలంగాణలోనూ మిగ్‌జాం తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది.

రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుఫాను ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి, పలు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు కురవడంతో చెరువులు, కాలువులు పొంగిపొర్లాయి.  పలుచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేల కూలాయి. తుఫాను ప్రభావంతో అమరావతిలోని సచివాలయంలో ప్రభుత్వ ఈ -ఆఫీస్‌ నెట్‌వర్క్‌ నిలిచిపోయింది.

తుఫాన్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని సూచించారు. తుఫాను సహాయ చర్యల కోసం ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం రూ.22 కోట్లు విడుదల చేసింది. బాపట్ల, గుంటూరు, కృష్ణా, చిత్తూరు తదితర ప్రభావిత జిల్లాల్లో హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసింది.

తీవ్ర తుఫాన్‌ తీరం దాటిన తర్వాత ఉత్తరంగా పయనించి దిశ మార్చుకుంది. ఉమ్మడి కృష్ణాజిల్లా మీదుగా తెలంగాణలోని ఖమ్మం, అక్కడ నుంచి ఛత్తీస్‌గఢ్ దిశగా పయనించనుంది. ఈ క్రమంలో ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా అది బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దిశ మార్చుకున్నందున తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఉత్తర కోస్తాలో వర్షాలు కొనసాగుతాయని,బుధవారం కూడా కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

మరోవైపు మిగ్‌జాం తుఫాన్‌ తమిళనాడు రాజధాని చెన్నై నగరంతో పాటు తొమ్మిది తీర ప్రాంత జిల్లాల్లో కల్లోలం సృష్టించింది. సోమవారం కుండపోత వానలు కురవగా మంగళవారం కాస్త విరామం ఇచ్చాయి. భారీ వర్షాల ప్రభావంతో ప్రభావిత ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. వరద నీరు పోటెత్తడంతో లోతట్టు జలమయమయ్యాయి. రహదారులపైకి కూడా పెద్దయెత్తున నీరు చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. 
విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఒడిశాలోని దక్షిణ జిల్లాలపై కూడా మిగ్‌జాం తుఫాన్‌ ప్రభావం చూపింది. చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం సంబంధిత ప్రమాద ఘటనల్లో 12 మంది మరణించారు. మరో 11 మందికి గాయాలయ్యాయి.