బిజెపి పాలనలో 12 రాష్ట్రాలు, మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌

ఆదివారం నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దేశంలోని 28 రాష్ట్రాల్లో 12 బీజేపీకి హస్తగతమయ్యాయి.  ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, త్రిపుర, మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. దీంతో 41 శాతానికిపైగా దేశ జనాభాను బీజేపీ ఏకాకిగా పాలిస్తున్నది.

కాగా, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, సిక్కింలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నది. కూటమి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటే దేశ జనాభాలో సగానికిపైగా బీజేపీ పాలిస్తున్నది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దేశ భూభాగంలో 58 శాతంగా, జనాభాలో 57 శాతంగా ఉన్నాయి. ఉత్తర భారత దేశంతో, ప్రధానంగా హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుంది.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటకలతోపాటు తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దేశ జనాభాలో 8.51 శాతం మాత్రమే కాంగ్రెస్‌ పాలన పరిమితమైంది. బీహార్, జార్ఖండ్‌, తమిళనాడులలో కూటమి పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నది. ఇది కూడా కలుపుకుంటే దేశ జనాభాలో 19.84 శాతం పాలనకే కాంగ్రెస్‌ పరిమితమైంది.

ఇక ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు దేశ భూభాగంలో 41 శాతం, దేశ జనాభాలో 43 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలా ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై విజయం సాధించడం చాలా కష్టమని ‘ఇండియా’ బ్లాక్‌ నేతలు పెదవి విరుస్తున్నారు. ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ తీరుపై మండిపడుతున్నారు.