కాంగ్రెస్ కు పట్టం గట్టిన తెలంగాణ ఓటర్లు

కాంగ్రెస్ కు పట్టం గట్టిన తెలంగాణ ఓటర్లు

తెలంగాణ అసెంబ్లీలోని 119 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విపక్ష కాంగ్రెస్ 2.02 శాతం ఓట్ల ఆధిక్యతతో 65 సీట్లను కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత వరుసగా 3వ సారి గెలిచి హ్యాట్రి క్ సాధించాలనుకున్న అధికార బిఆర్‌ఎస్‌కు బ్రేక్ పడింది. 

ఓట్ల శాతం

  • కాంగ్రెస్ – 39.40 శాతం
  • బీఆర్ఎస్-37.35 శాతం
  • బీజేపీ – 13.90 శాతం
  • ఎంఐఎం -2.22 శాతం

మొత్తం ఫలితాలను విశ్లేషిస్తే గెలిచిన కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో అది ఎనిమిది జిల్లాల్లో ఘన విజయం సాధించగా, అధికార బిఆర్‌ఎస్ గ్రేటర్‌లోని 39 స్థానాల్లో 17 స్థానాలు గెలుచుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 17 స్థానాలు గెలుచుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి మినహాయిస్తే కరీంనగర్‌లో 5 స్థానాలు, మెదక్‌లో 7 స్థానాలు బిఆర్‌ఎస్ గెలుచుకొన్నది. 

ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్‌లో 45 వేలకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించినా, కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఈ పార్టీ 119 స్థానాల్లో 39 స్థానాలు కైవసం చేసుకొని ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి వెళ్లబోతున్నది. 

అధికార బిఆర్‌ఎస్‌లో ఆరుగురు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్‌ కుమార్ లు ఓటమి పాలయ్యారు. త్రిముఖ పోటీలో రణక్షేత్రంలో వున్న అన్ని పార్టీల కన్నా బిజెపి 8 సీట్లను గెలుచుకొని తన బలాన్ని అనూహ్యంగా పెంచుకొన్నది. ఎంఐఎం యథాతథంగా తన 7 సీట్లను గెలుచుకోగలిగింది. 

బరిలో వున్న బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టి పోటీ ఇచ్చి డిపాజిట్ దక్కించుకున్నా,  ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేక చతికిలబడింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని సిపిఐ కొత్తగూడెంలో ఒక్క సీటును గెలుచుకొని తన ఎంఎల్‌ఎ కూనం సాంబశివరావు అసెంబ్లీలోకి పంపుతున్నది. సిపిఎం 17 సీట్లలో పోటీ చేసినా కనీసం ఒక్క చోట కూడా ప్రభావం చూపలేకపోయింది.

బిఆర్‌ఎస్ పార్టీని ఆదుకుంటుందని భావించిన దళితబంధు పథకం ఆ పార్టీకి శరఘాతంలా పరిణమించింది.ఎస్‌సిలకు రిజర్వ్ చేసిన 17నియోజకవర్గాల్లో 15 నియోజవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, స్టేషన్ ఘన్‌పూర్, చేవేళ్లల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య 8కి చేరి రెట్టింపయింది. వీరిలో తొలిసారిగా ఎన్నికైన వారే అధికంగా ఉండటం విశేషం. కొత్తగా విజయం సాధించిన వారిలో కంటోన్మెంట్ నుంచి లాస్యా నందిత,పాలకుర్తిలో యశస్విని, నారాయఖేడ్‌లో వర్నికారెడ్డి ఉండగా ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మీ, నర్సాపూర్‌లో సునీతా లక్ష్మా రెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ తూర్పులో కొండా సురేఖ, ములుగులో సీతక్క, కోదాడలో పద్మావతి మరో సారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.