తుప్రాన్‌లో కూలిన శిక్షణా విమానం.. ఇద్దరు మృతి

మెదక్‌ జిల్లా తుఫ్రాన్ మండలం రావెల్లిలో శిక్షణా విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఉదయం 8గంటల సమయంలో పెద్ద శబ్దంతో విమానం కూలిపోవడాన్ని స్థానికులు గుర్తించారు. విమానం కూలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శిక్షకుడితో పాటు మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

తుఫ్రాన్ సమీపంలో రావెల్లి గుట్టల్లో శిక్షణ విమానం కూలిపోయింది. భారీ శబ్దాన్ని గుర్తించిన సమీపంలో పనుల్లో ఉన్న రైతులు ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకుపోవడంతో సమీపంలోకి వెళ్లేందుకు సాహసించలేదు. ప్రమాద సమాచారాన్ని స్థానికులు పోలీసుకు అందించారు.

కూలిన విమానం దుండిగల్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన శిక్షణా విమానంగా పోలీసులు గుర్తించారు. అందులో ఎంత మంది ఉన్నారనే విషయంలో స్పష్టత రాలేదు. ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్లు తప్పించుకున్నారా లేదా అనేది తేలాల్సి ఉంది. పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకొని ఒకరి సజీవదహనం

ట్రావెల్స్‌ బస్సు మంటల్లో చిక్కుకుని ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. నల్గొండ వద్ద తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు బస్సు నుంచి కిందకు దిగలేక సజీవ దహనమయ్యాడు. మర్రిగూడ బైపాస్‌ దగ్గరలో షార్ట్‌సర్క్యూట్‌తో బస్సు దగ్ధమయ్యింది.తెల్లవారుజామున బస్సులో పొగలు, మంటలు రావడంతో అప్రమత్తమైన ప్రయాణికులు కిందకు దిగిపోయారు. నిద్రమత్తులో ఓ వ్యక్తి బస్సు దిగక పోవడంతో. మంటలు ఆరిన తర్వాత అతడు సజీవ దహనమై మృతి చెందినట్లు గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి చీరాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులకు చెందిన వస్తువులు సైతం కాలిపోయాయి.