MIMను దూరం పెడుతోన్న పాతబస్తీ ఓటర్లు…

ముస్లిం సమాజానికి తామే బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఔవైసీ బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీడియాలో ఎంఐఎం బ్రదర్స్ చేసే హడావుడి అంతా, ఇంతా కాదు. మీడియా కూడా వాస్తవాలను గమనించకుండా.. వాళ్ళిద్దరికీ ఇవ్వాల్సిన ప్రయార్టీ కన్నా చాలా ఎక్కువే ఇచ్చిందనే చెప్పాలి. అటువంటి ఎంఐఎం బ్రదర్స్ అసలు బలమేంటో.. తెలంగాణ ఎన్నికల ఫలితాల సాక్షిగా మరోసారి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ పాతబస్తీని తమ అడ్డాగా చేసుకుని రాజకీయం చేస్తున్న ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటి చేసింది. 7 చోట్ల గెలుపొందింది. అయితే.. అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఈ 7 సీట్లు ఉండటం గమనార్హం. అయితే.. వీటిలో నాంపల్లి, యాకత్ పురా, కార్వాన్, మలక్‌పేట్, చార్మినార్ స్థానాల్లో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంది. అతికష్టం మీద గెలుపొందగలిగింది.
అయితే.. ఈ ఎన్నికల్లో కేవలం 2.2 శాతంతో 5 లక్షల 19 వేల 379 ఓట్లను మాత్రమే ఎంఐఎం పార్టీ పొందగలిగింది. కేవలం 7 ఎమ్మెల్యే సీట్లు.. 2.2 శాతం ఓట్లకు మాత్రమే పరిమితం అయిన ఈ పార్టీ.. దేశంలోని ముస్లింలంతా తమ వెనుకే ఉన్నట్టుగా బిల్డప్ ఇవ్వటం.. మీడియా స్టంట్ తప్ప మరేమీ కాదనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది. వాస్తవానికి ఎంఐఎం బరిలో నిలిచిన చోట్ల చాలా తక్కువగా పోలింగ్ శాతం నమోదు అయ్యింది. ఈ పార్టీ నైజం తెలిసిన ముస్లింలెవరూ పోలింగ్ బూత్‌ల వైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఓటింగ్‌కు దూరంగా ఉండటం ద్వారా MIM పట్ల తమ నిరసన వ్యక్తం చేశారు. మొత్తం మీద.. అంగబలం, అర్ధబలంతో కొన్ని నియోజకవర్గాలను తమ చెప్పుచేతుల్లో ఉంచుకోవటం తప్ప.. హైదరాబాద్‌లో MIM పార్టీ ఉనికి నామమాత్రమే అనే విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. పాతబస్తీలో ఎంఐఎం పతనానికి తాజా ఎన్నికల ఫలితాలు బాటలు వేసాయని పేర్కొంటున్నారు.