`ఇండియా’ కూటమిలో కాంగ్రెస్ ఓటమి చిచ్చు

ఉత్తరాదిలో కీలకమైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలదన్ని బిజెపి ఘన విజయాలు సాధించడం, కాంగ్రెస్ ఘోర పరాజయంకు గురికావడంతో ప్రతిపక్ష కూటమి `ఇండియా’పై నీలినీడలు వ్యాపిస్తున్నాయి. మూడు నెలల క్రితమే ముంబైలో కూటమి సమావేశం జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఇక ఏ ఎన్నిక జరిగినా బిజెపి అభ్యర్థిగా ఒకే అభ్యర్థి పోటీచేయాలని నిర్ణయించారు. 
 
అందుకోసం భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లను ఓ నెల రోజుల్లో పూర్తి చేయాలని భావించి, అందుకోసం ఓ కమిటీని కూడా నియమించారు.  అయితే ఇప్పటి వరకు కనీసం కూటమి కన్వీనర్ ఎంపిక కూడా జరగకుండా, ఈ కమిటీ సమావేశాలు కూడా జరపకుండా, ఉమ్మడిగా ఆందోళనలు జరపాలనే నిర్ణయం కూడా అమలు కాకుండా అడ్డుపడుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నాయి.
 
ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందితే సీట్ల సర్దుబాట్లలో తమ మాట చలామణి అయ్యేటట్లు చేసుకోవచ్చని కాంగ్రెస్ ఆ అంశాన్ని దాటవేస్తూ వచ్చింది. కనీసం ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో అయినా భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లకు ముందుకు రాలేదు.  కేవలం తెలంగాణాలో సిపిఐకి ఒక సీట్ వదిలారు. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో చిన్న, చిన్న పార్టీలు విడిగా పోటీ చేయడం ద్వారా కూటమి స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరించింది.
 
ఇప్పుడు కీలకమైన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో కూటమి నాయకత్వం కాంగ్రెస్ చేతుల నుండి మారాలనే వాదన తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గుర్తు ‘హస్తం’ భస్మాసుర హస్తంగా మారుతుందని, త్వరలో ఇండియా కూటమి ఇంటికి పోవడం ఖాయమని ఈ ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. 
 
నాయకత్వం మార్పు కోసం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) బహిరంగంగానే డిమాండ్‌ చేసింది. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు పొందిన కాంగ్రెస్‌ను ఆయన నిందించారు. ఈ ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి నష్టమే తప్ప బీజేపీ గెలుపు కాదని అంటూ ధ్వజమెత్తారు.  ‘మూడు రాష్ట్రాల ఫలితాలు బీజేపీ విజయగాథ కంటే కాంగ్రెస్ వైఫల్యమే ఎక్కువ’ అని ఆయన విమర్శించారు.
 
‘దేశంలో బీజేపీని ఓడించే యుద్ధంలో నాయకత్వాన్ని అందించే పార్టీ టీఎంసీ’ అని ఎక్స్‌లో పేర్కొంటూ లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి గెలువాలంటే మమతా బెనర్జీ సారధ్యానికి ప్రతిపక్షాలు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ‘భారత’ కూటమి అవకాశాలపై అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపబోవని టిఎంసి, ఎన్సీపీ, సీపీఎం తదితర పార్టీల నేతలు పైకి మేకబొతు గాంభీర్యం ప్రకటిస్తున్నా కాంగ్రెస్ `పెద్దన్న’ ధోరణి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టం అవుతుంది.
 
మధ్యప్రదేశ్ లో తమ పార్టీతో పొత్తు అంటూ సాగదీసి చివరకు ఏకపక్షంగా తమ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించడం పట్ల ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాట్లు ఉండబోవని సంకేతం ఇచ్చారు. `ఇండియా’ కూటమి సమావేశం తర్వాతనే ఈ ఫలితాల గురించి వ్యాఖ్యానిస్తామని ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ చెప్పడం గమనార్హం.

కాగా, మూడు తర్వాత `ఇండియా’ కూటమి సమావేశం ఈ నెల 6న జరగబోతున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఫోన్‌ ద్వారా భాగస్వామ్య పక్ష నేతలకు తెలిపారు.