ప్ర‌జాతీర్పుకు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా

* తెలంగాణతో బంధం విడదీయలేనిది 
 
 చ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ విజ‌యం సాధించింది. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ స‌ర్కార్ ఏర్పాటు కాబోతున్న‌ది. ఈ నేప‌థ్య‌లో ప్ర‌ధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ ప్ర‌జాతీర్పుకు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్న‌ట్లు చెప్పారు. మూడు రాష్ట్రాల ఫ‌లితాలు సుప‌రిపాల‌న‌, అభివృద్ధి వైపే ప్ర‌జ‌లు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు సూచిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. 
 
స‌డ‌ల‌ని మ‌ద్ద‌తు ఇచ్చిన ఈ రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా ప‌నిచేయ‌నున్న‌ట్లు ఆయన  చెప్పారు. తీవ్రంగా క‌ష్ట‌ప‌డిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. అభివృద్ధి ఎజెండాను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌డంతో కార్య‌క‌ర్త‌లు విజయవంతం అయిన‌ట్లు చెప్పారు.
 
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ తెలంగాణలో బీజేపీ కి ప్రజా మద్దతు పెరుగుతోందని తెలిపారు. ఈ  ధోరణి  రానున్న రోజుల్లో కొనసాగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
 
‘నా ప్రియమైన తెలంగాణ సోదరసోదరీమణులారా.. మీరు బీజేపీ పార్టీకి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా మాకు మద్దతు పెరుగుతూనే ఉంది. ఈ సరళి రాబోయే కాలంలో కూడా ఇలాగే కొనసాగుతుంది. తెలంగాణతో మా బంధం విడదీయరానిది. ప్రజల కోసం మేము పని చేస్తూనే ఉంటాం. ప్రతి బీజేపీ కార్యకర్త చేసిన అపార కృషిని నేను అభినందిస్తున్నాను’ అంటూ మోదీ తెలుగులో ట్వీట్‌ చేశారు.
 
ఈ ఎన్నికలలో బిజెపికి ప్రోత్సాహకరమైన మద్దతు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ధన్యవాదములు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం తమ కృషిని కొనసాగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజల మద్దతుతో తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తప్పనిసరిగ్గా మారుస్తామని చెప్పారు.