బీజేపీ జైత్రయాత్ర వెనుక మహిళా ఓటర్లు ?

 
మధ్యప్రదేశ్,  ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలతో దూసుకుపోతోంది. గతంతో పోలిస్తే ఇరు రాష్ట్రాల్లోనూ సీట్లు భారీగా పెంచుకోవడంతో పాటు  ఛత్తీస్‌గఢ్‌లలో విజయాన్ని సైతం తమ ఖాతాలో వేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ సైతం ఊహించని స్ధాయిలో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ సాధిస్తున్న విజయాల వెనుక మహిళా ఓటర్లు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
 
గత ఎన్నికలతో పోలిస్తే మధ్యప్రదేశ్ తో పాటు ఛత్తీస్ ఘడ్ లోనూ మహిళల ఓట్లు భారీగా పోలయ్యాయి. గతంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్ ఘడ్ లో 74 శాతం మహిళా ఓట్లు పోలయితే ఈసారి అది 76 శాతానికి చేరింది. అలాగే మధ్యప్రదేశ్ లోనూ 2018లో జరిగిన ఎన్నికల్లో 74 శాతం మహిళా ఓట్లు పోలయితే ఈసారి అక్కడా 76 శాతం మహిళా పోలింగ్ నమోదైంది. ఇదే ఇరు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కొంపముంచినట్లు తెలుస్తోంది.

అయితే ఇంత పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు మధ్యప్రదేశ్ లోనూ, గతంలో ఆ రాష్ట్రంలో భాగంగా ఉండి ఆ తర్వాత విడిపోయిన  ఛత్తీస్‌గఢ్‌లోనూ బీజేపీకి మద్దతుగా నిలవడం వెనుక ఆ పార్టీ ప్రకటించిన ఎన్నికల హామీలకు తోడు మహిళా బిల్లు ప్రభావం కూడా పడినట్లు తెలుస్తోంది. మహిళలకు గ్యాస్ బండల ధర తగ్గింపు, ఇతర మహిళా కేంద్రక పథకాలు ప్రకటించిన బీజేపీ ఆ మేరకు ఫలితాలను రాబట్టుకుంది. 

అయితే కాంగ్రెస్ కూడా దాదాపు ఇలాంటి హామీలే ఇచ్చినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇస్తున్న హామీలు మహిళా ఓటర్లను ఎక్కువగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.

మధ్య ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న లాడ్లీ బెహనా యోజన ఈ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపునకు ప్రధాన కారణంగా మారిందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జ్యోతరాదిత్య సింధియా తెలిపారు. ఈ సంక్షేమ పథకం కింద ప్రతీ పేద కుటుంబంలోని మహిళకు నెలకు రూ. 1250 అందిస్తారు. ఈ స్కీమ్ ను విజయవంతంగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దేనని సింధియా కొనియాడారు.

ఇప్పటికే అధికారంలో ఉన్న మధ్య ప్రదేశ్ లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు, రాజస్తాన్, చత్తీస్ గఢ్ ల్లో పవర్ లో ఉన్న కాంగ్రెస్ నుంచి అధికారాన్ని లాగేసుకునే పరిస్థితి నెలకొనడంతో బీజేపీ మరింత బలోపేతం గా మారుతోంది. ఈ ఫలితాలతో బీజేపీ రానున్న లోక్ సభ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో పోటీ పడనుంది.

మరోవంక, పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిపక్ష పార్టీలను ఘాటుగా హెచ్చరించారు. పార్లమెంట్‌ సమావేశాలకు అంతరాయం కలిగిస్తే, ఆదివారం చవిచూసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే దారుణాన్ని ఎదుర్కొంటారన్ని హెచ్చరించారు. అయితే అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నియమ, నిబంధనల ప్రకారం ఇది జరుగాల్సి ఉందని పేర్కొన్నారు.