ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామ మందిరం

యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి.  ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠను 2024 జనవరి 22 మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఇప్పటికే ప్రకటించారు.
ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయునున్నారు.  ఇక ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
పూజారులు, దాతలు సహా దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సహా మొత్తం 6,000 మంది అతిథులకు ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు పూజారులు, సాధువులే కాదు, ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లతో సహా అగ్ర రాజకీయ నాయకులు కూడా జనవరి 22న జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. అయోధ్య సాధువులు అతిథులను సాదరంగా ఆహ్వానించనున్నారు.

మరోవైపు రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2024లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించనుందని వారు వెల్లడించారు. మరోవైపు ఆలయ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా పనులు పూర్తయితాయని రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ ఇప్పటికే తెలిపింది.

15 నాటికి అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ తొలిదశ పూర్తి                            
కాగా, అయోధ్యలో నిర్మితమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం తొలిదశ పనులు ఈ నెల 15 నాటికి పూర్తవుతాయని యూపీ ముఖ్యమంత్రి  ఆదిత్యనాథ్‌ తెలిపారు. ఇక్కడ నిర్మితమవుతున్న మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, వీకే సింగ్‌లతో కలిసి పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విమానాశ్రయ మొదటి దశ జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కంటే నెల ముందే పూర్తవుతాయని చెప్పారు. అతి త్వరలోనే రెండో దశ నిర్మాణానికి అనుమతి వస్తుందని తెలిపారు. కాగా విమానాశ్రయంలో అయోధ్యసాంస్కృతిక నైతికత ప్రతిబింబించేలా కృషి చేశామని కేంద్రమంత్రి సింధియా చెప్పారు.గంటకు 2 3 విమానాలను నిర్వహించగల సామర్థంలో 65వేల చదరపు అడుగుల టెర్మినల్ మొదటి దశ నిర్మాణంలో ఉంది.