52 శాతం మేర తగ్గిన నక్సల్స్ కార్యకలాపాలు

గత పది సంవత్సరాలలో దేశంలో నక్సల్స్ చర్యలు దాదాపుగా 52 శాతం మేర తగ్గినట్లు చెబుతూ పూర్తిస్థాయిలో నక్సలిజం ఏరివేత జరుగుతుందని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. శుక్రవారం హోం మంత్రి జార్ఖండ్‌లోని హాజరీబాగ్‌లోని మేరులో బిఎస్‌ఎఫ్ 59వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొంటూ గతంలో 96 జిల్లాలు నక్సల్స్ ప్రభావితం అయ్యాయని, ఇప్పుడీ సంఖ్య 45కు చేరిందని తెలిపారు.

నక్సలిజం నిర్మూలనకు దేశంలో ఇప్పుడు చర్యలు వేగవంతం అయ్యాయని, ఈ క్రమంలో పురోగతి దిశలో ఉన్నామని పేర్కొంటూ ప్రధాని మోదీ  ప్రభుత్వం నక్సలిజంపై పోరులో గెలుపు దక్కించుకునేందుకు కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.

నక్సల్స్ చర్యలలో హతుల సంఖ్య దాదాపు 70 శాతం వరకూ తగ్గిందని చెబుతూ వామపక్ష తీవ్రవాద చర్యలతో దెబ్బతిన్న పోలీసు స్టేషన్ల సంఖ్య ఇంతకు ముందు 495 వరకూ ఉండగా, ఇప్పుడిది 176కు చేరిందని హోం మంత్రి తెలిపారు. బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, ఐటిబిపి వంటి బలగాలతో ఇప్పుడు నక్సలైట్లపై పోరు తుది దశకు చేరిందని వివరించారు. 

నక్సలిజం సమస్య లేకుండా చేసే దశకు చేరుకుంటున్నామని తెలిపారు. జార్ఖండ్‌తో పాటు పలు రాష్ట్రాలలో నక్సలిజం నిర్మూలన దిశలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. 2019 నుంచి ఇప్పటివరకు నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాలలో పలు వ్యూహాలతో భద్రతా బలగాలు విజయపథంలో సాగుతున్నాయని తెలిపారు. 

నక్సల్స్‌పై చక్రబంధం ప్రయోగిస్తున్నాయని పేర్కొంటూ ఈ క్రమంలో అటవీ, పర్వత ప్రాంతాలలో మావోయిస్టులు దిగ్బంధం జరిగిందని అమిత్ షా చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కొత్తగా 199 వరకూ భద్రతా బలగాల క్యాంపులు ఏర్పాటు చేశామని, దీనితో నక్సలిజం నిర్మూలన మరింతగా కార్యాచరణకు మారిందని వివరించారు. 

సుశిక్షితులైన మన వీర జవాన్ల బలగాలతో మన సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. దేశ ప్రగతికి సరిహద్దుల భద్రత కీలకం. ఈ నేపథ్యంలో మనం కంటినిండా కునుకు తీయడానికి, మరింత పురోగమించడానికి పరోక్షంగా పాటుపడుతున్నది జవాన్లే అని వారికి మనసారా సెల్యూట్ అని అమిత్ షా తెలిపారు.

1965లో ఈ రోజునే (డిసెంబర్ 1న) 2.65 లక్షల మంది సిబ్బందితో బిఎస్‌ఎఫ్ అవతరించింది. విశిష్ట సేవలు అందిస్తోంది.