యూఏఈ భాగస్వామ్యంతో ఇంధన రంగంలో భద్రత

యూఏఈతో భాగస్వామ్య ఒప్పందం చేసుకోవడం వల్ల ఇంధన రంగంలో భద్రతతో పాటూ, బలాన్ని పెంచుకోవచ్చు అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దుబాయిలో వాతావరణ శిఖరాగ్ర సమావేశం అనంతరం గత రాత్రి ప్రధాని మోదీ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దుబాయిలో జరిగిన కీలక చర్చల అనుభవాలను ప్రధాని ఎక్స్‌(X)లో పంచుకున్నారు. 
 
“ధన్యవాదాలు, దుబాయ్! ఇది ఉత్పాదకమైన #కాప్28 సమ్మిట్. మంచి గ్రహం కోసం అందరం కలిసి పని చేద్దాం” అని ప్రధాని మోదీ పోస్ట్‌లో పేర్కొంటూ సంబంధిత వీడియోను షేర్ చేశారు.  గ్లోబల్ సోలార్ ఫెసిలిటీకి మద్దతు ఇవ్వడం వల్ల ఒకరి బలాన్ని ఒకరు పెంపొందించుకునేందుకు వీలుంటుందని చెబుతూ ఈ ఒప్పందం ద్వారా భారత్, యూఏఈలు మంచి సుసంపన్నమైన భవిష్యత్తుకు బాటలు వేసేందుకు దోహదపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇరు దేశాలు ఇంధన రంగంలో చేతులు కలపడం ద్వారా రీ ప్రొడక్టివ్ శక్తిని ప్రోత్సహించేందుకు వీలు పడుతుందని చెబుతూ యూఏఈలో తాను ఆరో సారి పర్యటిస్తున్నట్లు చెప్పారు. అభివ‌ృద్ది చెందుతున్న దేశాలు ఏవైనా సమస్యల్లో ఉంటే వాటిని పరిష్కరించడంలో భాగం కావాలని, దీనికి తాను సుముఖంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

అందులో భాగంగా అవసరమైన ఆర్థిక, సాంకేతికతను ఒకరికొకరు అందిపుచ్చుకోవాలని కోరారు.”మెరుగైన భూగోళం కోసం పని చేయడానికి ప్రపంచ దేశాలు కృషి చేయాలి. కాప్-28 సదస్సులో ప్రపంచ దేశాధినేతలతో వాతావరణ మార్పులకు సంబంధించి చర్చలు జరిగాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఉమ్మడి కార్యాచరణ రూపొందించాం” అని ప్రధాని తెలిపారు.

సందర్భంగా, ప్రధాని మోదీ కింగ్ చార్లెస్ IIIతో సమావేశమయ్యారు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా కింగ్ చార్లెస్‌ పోరాడుతున్నారని మోదీ కొనియాడారు.  “ఈరోజు ముందుగా దుబాయ్‌లో, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ మక్కువ చూపే కింగ్ చార్లెస్‌తో సంభాషించే అవకాశం నాకు లభించింది. వాతావరణ మార్పులపై పోరాటంలో ఆయన ఒక ముఖ్యమైన స్వరం. @RoyalFamily” అని ప్రధాని మోదీ ఒక పోస్ట్‌లో తెలిపారు. 

దుబాయి పర్యటనలో ఆయన వియత్నం ప్రధాని ఫామ్ మిన్ చిన్హ్ తదితరులను కలిశారు. ఆ తరువాత అక్కడి పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కూడిన ఏడు ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొన్నారు. నాలుగు చోట్ల దౌత్య పరమైన అంశాలపై ప్రసంగించారు. “ప్రధానమంత్రి పర్యటన ప్రపంచ నాయకులతో ఫలవంతమైన నిశ్చితార్థాలు మరియు ప్రపంచ వాతావరణ చర్యలను వేగవంతం చేయడానికి మార్గనిర్దేశం చేసే కార్యక్రమాల ద్వారా నిర్వచించబడింది” అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక పోస్ట్‌లో తెలిపారు.

ఇలా ఉండగా, వాతావరణ సదస్సులో ప్రసంగిస్తూ కేవలం ఆషామాషీగా లేదా నామమాత్రంగా గ్లోబల్ వ్యర్థాల కట్టడికి దిగితే సరిపోదని, తులనాత్మక గణనీయ స్థాయిలో తగు విధంగా నియంత్రణ చర్యలకు దిగాల్సి ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 
 
భూగోళ పరిరక్షణ దిశలో అత్యంత కీలకమైన ప్రతిపాదనను భారతదేశం తీసుకువచ్చిందని, ఇందులో భాగంగా ప్రతి నివాసం ప్రతి పౌరుడు ఎప్పటికప్పుడు కార్బన్ ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకుంటూ, ఇదే సమయంలో కార్బన్ ఉద్గారాల వెలువడుతున్న తీరుతెన్నుల గురించి తెలుసుకుంటూ ఉంటారని తెలిపారు. కేవలం ఈ గ్రీన్‌కార్డు విధానానికి కట్టుబడితే వాతావరణ మార్పులను సరైన రీతిలో నియంత్రించేందుకు వీలేర్పడుతుందని ప్రధాని భరోసా వ్యక్తం చేయసారు.
 
 కార్బన్ జాడలను సంపన్న దేశాలు తమ వంతు బాధ్యతగా పూర్తి స్థాయిల్లో కట్టడి చేయాల్సి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. కార్బన్ ఉద్గారాల నియంత్రణ విషయంలో ఈ దేశాలు 2052కు ముందే తగు చర్యలు తీసుకోవల్సి ఉంటుందని ఆయన కోరారు.