నాలుగో టీ20లో భారత్‌ జయభేరి.. సిరీస్ కైవసం

* టీమిండియాకు ఫినిషర్ లోటు తీరుస్తున్న రింకూసింగ్

యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు సత్తాచాటింది. ఇటీవల వన్డే ప్రపంచకప్‌ నెగ్గిన ఆస్ట్రేలియాపై మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో యంగ్‌ఇండియా 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌ (29 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా, వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ (19 బంతుల్లో 35; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు), యశస్విజైస్వాల్‌ (37; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (32; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) తలాకొన్ని పరుగులు చేశారు. 

కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (1)తో పాటు తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన శ్రేయస్‌ అయ్యర్‌ (8) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.ఈ మ్యాచ్‌ కోసం భారత జట్టు ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్‌ను పక్కన పెట్టగా.. వారి స్థానాల్లో జితేశ్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, ముఖేశ్‌ కుమార్‌ బరిలోకి దిగారు. 

మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఐదు మార్పులతో బరిలోకి దిగింది. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన జట్టులో ట్రావిస్‌ హెడ్‌ ఒక్కడే ఈ మ్యాచ్‌లో ఆడాడు. ఆసీస్‌ బౌలర్లలో బెన్‌ డ్వార్షే 3, బెహ్రాన్‌డార్ఫ్‌, తన్వీర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.  అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ (36 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అత్యధిక స్కోరర్‌ కాగా.. హెడ్‌ (16 బంతుల్లో 31; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) పర్వాలేదనిపించాడు. 

భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 3, దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన ఆఖరి పోరు ఆదివారం బెంగళూరులో జరగనుంది.

మరోవంక, భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ జట్టుకు దూరమైనప్పటి నుంచి భారత జట్టు ఫినిషర్‌ కోసం ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు రింకూసింగ్‌ రూపంలో ఆ లోటు తీరినట్లు కనిపిస్తున్నది. హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే, దినేశ్‌ కార్తీక్‌ వంటి వాళ్లను ప్రయత్నించినా వారెవరూ ఎక్కువ కాలం ఆ స్థానంలో కొనసాగలేకపోయారు. 
 
హార్దిక్‌, సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌ నిర్మించే బాధ్యత భూజానెత్తుకోగా ఇప్పుడు రింకూ రూపంలో టీమ్‌ఇండియాకు ప్రత్యామ్నాయ ఫినిషర్‌ లభించాడు. ఐపీఎల్లో కోల్‌కతా తరఫున చివరి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాది వెలుగులోకి వచ్చిన రింకూ.. అప్పటి నుంచి అదే బాదుడు కొనసాగిస్తున్నాడు. 
 
ఛేదనలో చివరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తున్న ఈ గడుసు పిండం మొదట బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు కూడా అదే దూకుడుతో బౌలర్ల లయ దెబ్బతీస్తున్నాడు. తాజా మ్యాచ్‌లో సీనియర్‌ ప్లేయర్లు సూర్యకుమార్‌, శ్రేయస విఫలమైన సమయంలో క్రీజులోకి అడుగుపెట్టిన రింకూసింగ్‌ ఎలాంటి తడబాటు లేకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.