బిఆర్ఎస్, కాంగ్రెస్ ల్లో హాంగ్ అసెంబ్లీ భయం

* ఎమ్యెల్యేల హైజాక్ కోసం మంతనాలు
 
తెలంగాణ ఎన్నికలపై పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు ఆధిక్యత లభిస్తుందని చెబుతున్నప్పటికీ స్పష్టమైన మెజార్టీపై ఆ పార్టీ నాయకులలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవంక, ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోని బిఆర్ఎస్ పెద్దలు సహితం తామే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు గాంభీర్యం ప్రకటిస్తున్నారు.
 
రెండు పార్టీల నాయకులు సుమారు 70 సీట్లతో తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని పైకి చెబుతున్నప్పటికీ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో మెజారిటీ మార్క్ 60కు కొంచెం ఎక్కువ సీట్లు వచ్చిన్నప్పటికీ తమ ఎమ్యెల్యేలను కాపాడుకోవడం ప్రశ్నార్ధకంగా మారింది.
 
ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసిన పలువురికి బిఆర్ఎస్ నేతలు ఎన్నికల నిధులు సమకూర్చారని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు కొద్దిపాటి ఎమ్యెల్యేలు అవసరమైతే వారంతా బిఆర్ఎస్ వైపు తిరిగి వచ్చే అవకాశాలున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు పార్టీల అభ్యర్థులలో ఫిరాయింపుదారులు గణనీయ సంఖ్యలో ఉండడంతో గెలుపొందితే వారెటు ఉంటారో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోకుండా `మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము’ అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సొంత పార్టీ వారికి భరోసా కల్పించడం, ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగుతుండగా సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం అంతా ప్రత్యర్థులను గందరగోళంకు గురిచేసేందుకే అని భావిస్తున్నారు.
 
మరోవంక ఈవిఎంల రవాణాలో అక్కడక్కడా అక్రమాలు జరిపేందుకు ప్రయత్నాలు జరిగిన్నట్లు కూడా చెబుతున్నారు. గెలుపొందిన తమ అభ్యర్థులు ఎవ్వరూ చేజారిపోకుండా కాంగ్రెస్ నేతలు పకడ్బందీ వ్యూహాలు రూపొందిస్తున్నారు.  మరోవంక, బిఆర్ఎస్ శిబిరంలో గందరగోళం కలిగించడానికా అన్నట్లు పది మంది వరకు ఆ పార్టీ ఎమ్యెల్యేలుగా ఎన్నికైనవారు కాంగ్రెస్ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్యెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రకటించారు.  బిఆర్ఎస్ లోని అసంతృప్తి నేతలతో సంప్రదింపులకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నది.
 
ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా యితర పార్టీల నేతలతో కేసీఆర్ సంప్రదింపులు ప్రారంభించారని చెబుతున్నారు. ఈ పరిణామాలపట్ల కలతచెందిన  ఏఐసీసీ పెద్దలు చిదంబరం, సుశీల్‌ కుమార్‌ షిండే, సూర్జేవాలాలకు తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యతలు హైకమాండ్ అప్పగించింది.  కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సహితం హైదరాబాద్ కు చేరుకొని పూర్తిగా ఫలితాలు వెల్లడయ్యే వరకు ఇక్కడే ఉండనున్నారు.
ఎన్నికల ఫలితాలు ఖరారు కాగానే కాంగ్రెస్ అభ్యర్థులు అందరిని హైదరాబాద్ కు తరలిరమ్మనమని ఇప్పటికే కబురు పంపారు.  పైగా,తమ అభ్యర్థుల కదలికలపై కాంగ్రెస్ నేతలు నిఘా కూడా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈ పరిస్థితులను బిజెపి నేతలు సునిశితంగా గమనిస్తున్నారు. రెండంకెల సీట్లు వస్తే కొత్త ప్రభుత్వం ఏర్పాటులో `కింగ్ మేకర్’ పాత్ర వహించేందుకు సిద్దపడుతున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకొనేందుకు బిజెపి ప్రయత్నించే అవకాశం ఉంది.