4 వరకు సాగర్ నీటి విడుదల ఆపాలన్న కేంద్ర జలశక్తి శాఖ

సిఆర్‌పిఎఫ్ బలగాల స్వాధీనంలోకి సాగర్ డ్యామ్   
కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై ఈనెల 6న కేంద్ర జలశక్తి శాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించనుంది.
ఈ అంశాలపై శనివారం దిల్లీ నుంచి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వీడియో సమావేశం నిర్వహించారు.
అయితే తెలంగాణ సీఎస్ ఈరోజు సమావేశానికి హాజరు కాలేనని 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని కోరారు. అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయమనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ సూచించారు.   అయితే ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 6వ తేదీన వీడియో సమావేశం నిర్వహించి అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ఈసమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కేంద్ర జలశక్తి అధికారులు తెలిపారు.
అదే విధంగా నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై ఈనెల 4న కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కేఆర్ఎంబీ ఛైర్మన్ శివనందన్ కు సూచించారు.  అప్పటి వరకు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపాలని కోరారు.
కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తగు న్యాయం చేసేందుకు వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. కావున ఈనెల 6న అన్ని అంశాలపై చర్చించి వివాద పరిష్కారానికి కృషి చేస్తానని అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలని ఆమె పునరుద్ఘాటించారు.
మరోవంక, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతను కృష్ణా బోర్డు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. దీంతో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు డ్యామ్‌ను తమ ఆధీనంలోకి శనివారం తీసుకున్నాయి.
ఇలా ఉండగా, తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన నాగార్జున సాగర్ జలాశయాన్ని శనివారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులు సందర్శించారు. మొదట సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు. అనంతరం కుడి కాలువను సందర్శించారు. అలాగే డ్యామ్‌ను సెంట్రల్ వాటర్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వీఎన్‌రావు సైతం పరిశీలించారు. ఇదిలా ఉండగా, కేంద్రం ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ కుడి కాలువ ఏడవ నెం బర్ గేటును అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ఐదో నంబర్ గేట్ ద్వారా నీటి విడుదలవుతోంది. ఈ గేట్‌ను కూడా రాత్రి వరకు మూసివేయనున్నారు.
ఎపి విభజనలో భాగంగా కేఆర్‌ఎంబీ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణను తెలంగాణకు అప్పగించింది. అయితే, గత బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ ప్రభుత్వం దౌర్జన్యంగా డ్యామ్‌పై పోలీసు బలగాలను మోహరించి ,అనుమతి లేకుండా నీటిని విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బలగాలను సంఘటనా స్థలం లో మోహరించింది. కేంద్రం జోక్యంతో రెండు రాష్ట్రాలు బలగాలను ఉపసంహరించాయి. ప్రస్తుతం డ్యామ్‌ను కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
అయితే, పరిస్థితిపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు కేంద్రానికి నివేదిక అందజేసింది. ఏపీ ప్రభుత్వం నిబంధనలు అతిక్రమించి వ్యవహరించిందని నివేదిక లో పేర్కొంది. ఇండెంట్ లేకుండా, లేఖ రా యకుండా ఏపీ ప్రభుత్వం దౌర్జన్యంగా నీటిని విడుదల చేసిందని నివేదికలో తెలిపింది. మొదట ఇచ్చిన ఇండెంట్ ప్రకారం జనవరి, ఏప్రిల్‌లో ఐదు టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేయాల్సి ఉందని నివేదికలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు పేర్కొంది.