రూ. కోటి లంచం అడిగిన ఈడీ అధికారి అరెస్ట్

అవినీతిని అరికట్టేందుకు అవినీతిపరుల గుట్టు వెలికి తీయాల్సిన అధికారి అవినీతికి పాల్పడిన ఉదంతం వెల్లడైంది. తమిళనాడు అవినీతి నిరోధక విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడులోని మదురైలో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారిగా పని చేస్తున్న అంకిత్ తివారీని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.20 లక్షలు లంచం తీసుకుంటుంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
మదురై పొరుగు జిల్లా దిండిగుల్‌లోని ఓ ప్రభుత్వ వైద్యుడి ఆస్తులకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా అంకిత్ తివారీ రూ.కోటి లంచం డిమాండ్ చేశాడు. తొలుత రూ.20 లక్షలను పంపించాల్సిందిగా బాధితుడికి సూచించాడు. పూర్తి మొత్తాన్ని చెల్లిస్తేనే తన పని పూర్తవుతుందని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరించాడు. 
 
ఇచ్చిన డబ్బును తోటి ఉద్యోగులతో పంచుకోవాలని అంకిత్ చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో హైవే పక్కన డబ్బులు ఇస్తుండగా ఈడీ అధికారులు, పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు.  మద్రాస్ హైకోర్టులో కేసు విచారణకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  అంకిత్ కి డిసెంబర్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
అతని అరెస్ట్ తర్వాత, దిండిగల్ జిల్లా విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డివిఎసి) ఈడీ మదురై కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. అంకిత్ తివారీ నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. మదురై, చెన్నైకి చెందిన మరికొందరు అధికారులకు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
అంకిత్ తివారీ చాలా మందిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, వారి నుంచి కోట్ల రూపాయల లంచం తీసుకుంటున్నాడని పలువురు ఆరోపించారు. అతను ఈడీ అధికారులకు కూడా లంచాలు పంపిణీ చేస్తున్నాడని సంబంధిత వర్గాలు చెప్పాయి. అతడ్ని అదుపులోకి తీసుకున్నాక కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
కాగా, ఈ కేసులో తమిళనాడు అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ అధికారులు మదురైలోని ఈడీ సబ్‌ జోనల్‌ ఆఫీసుపై దాడులు నిర్వహించారు. కార్యాలయంలోని ఫైల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటికీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ భద్రత నడుమ అధికారులు ఈడీ ఆఫీసులో తనిఖీ చేస్తున్నారు. అయితే అర్ధరాత్రివేళ సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ ఆఫీసును తమిళనాడు పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకోవడంతో వారు గేటు బయటే ఉండిపోయారు.