21 మంది ఉన్నతాధికారులపై అసోం ప్రభుత్వం వేటు

అసోంలో ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్న కేసులో 21 మంది ఉన్నతాధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. 2013-14 సంవత్సరంలో అస్సాం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌లో సర్వీస్‌ కమిషన్‌ సహా పలువురు అధికారులు ఉద్యోగాలను అమ్ముకున్నారని  ఆరోపణలు ఉన్నాయి. 
 
ఈ కుంభకోణంలో ఇప్పటికే ఏపీఎస్సీ చైర్మన్‌ రాకేశ్‌ కుమార్‌ పాల్‌ సహా 70 మందిని సిట్‌ అరెస్టు చేసింది. తాజాగా మరో 21 మందిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. వారిలో అస్సాం సివిల్‌ సర్వీసెస్‌కు చెందిన నలుగురు అధికారులు, పోలీసు శాఖలో 11 మంది, ముగ్గురు అసిస్టెంట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్లు, ఇద్దరు కోఆపరేటివ్‌ సొసైటీస్‌కు రెందిన అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు, ఒక ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు. గతవారం మరో ఇద్దరు ఏపీఎస్‌ అధికారులను సిట్‌ అరెస్టు చేసింది.
 
రాకేశ్‌ కుమార్‌ పాల్‌ ఏపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న సమయంలో 2013-14లో కంబైన్డ్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించారు. దీనిద్వారా వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీచేశారు. అయితే ఉద్యోగాలను భారీ మొత్తానికి అమ్ముకున్నారని, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్‌ను నియమించింది. 
 
ఉద్యోగాల భర్తీలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిందని విచారణలో తేలింది. దీంతో 2016లోనే అప్పటి ఎపీఎస్సీ చైర్మన్‌ పాల్‌ను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఏండాది మార్చిలో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, 2014లో అక్రమమార్గంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.