బెంగళూరులో 15 పాఠశాలలకు బాంబు బెదిరింపులు

కర్ణాటక రాజధాని బెంగళూరులో 15కి పైగా పాఠశాలలకు శుక్రవారం ఉదయం బెదిరింపు ఈమెయిల్స్‌ రావడం తీవ్ర కలకలం రేపింది. ఆయా పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకులు మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సహా పాఠశాల సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

శుక్రవారం ఉదయం బసవేశ్వర్‌ నగర్‌లోని నేపెల్‌, విద్యాశిల్పతో సహా ఏడు పాఠశాలలకు ముందుగా బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నగరంలోని పలు పాఠశాలలకు అదే తరహా బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులకు గురైన పాఠశాలల్లో ఒకటి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ నివాసానికి ఎదురుగా ఉండటం గమనార్హం.

డిమాండ్లు కానీ, కారణాలు కానీ చెప్పకుండానే, ఆయా పాఠశాలలను బాంబులతో పేల్చేస్తామని  దాదాపు 15 పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ మెయిల్స్ వచ్చాయి. దాంతో, ఆయా పాఠశాలలు అప్రమత్తమై, ముందు జాగ్రత్త చర్యగా, విద్యార్థులను, పాఠశాల సిబ్బందిని బయటకు పంపించేశాయి. 

అనంతరం, పోలీసులకు సమాచారమిచ్చాయి. ఈ మెయిల్స్ పై బెంగళూరు నగర సైబర్ క్రైమ్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయని నగర పోలీస్ కమిషర్ బీ దయానంద రావు వెల్లడించారు. బెదిరింపు మెయిల్స్ వచ్చిన పాఠశాలల్లో, సమీపంలోని ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించామని, అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని వివరించారు.

దీంతో రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌ సాయంతో తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానిత వస్తువూ ఆయా పాఠశాలల్లో లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బెదిరింపు మెయిల్‌ ఆధారంగా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

కాగా, గతేడాది కూడా బెంగళూరు నగరంలోని పలు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. అయితే ఆ తర్వాత అవన్నీ బూటకమని తేలింది. ఇప్పుడు అదేతరహా బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.