ఉత్తరకాశి సొరంగం నుండి బైటపడ్డ 41 మంది కార్మికులు

ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకొని 17 రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ఒక్కొక్కరుగా చివరకు బయటకి వచ్చారు.  అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. విదేశీ యంత్రాలు విఫలమైన వేళ దేశీయ నిపుణుల శ్రమ ఫలితాలను ఇచ్చింది. ‘ర్యాట్‌ హోల్‌ మైనర్లు’ (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు) అద్భుతం చేశారు. 
 
సోమవారం రాత్రి నుంచి మెరుపు వేగంతో తవ్వకాలు చేపట్టినే 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు 57 మీటర్ల డ్రిల్లింగ్‌ పూర్తి చేసి కూలీలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత గొట్టాన్ని పంపించి అందులో నుంచి కార్మికులను ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. టన్నెల్ వెలువల అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లలో కూలీలను ఆసుపత్రికి తరలించారు.
కూలీలు టన్నెల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అక్కడే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించారు.  ప్రాణాలతో బయటకు వచ్చిన తమ వాళ్లను చూశాక.. కార్మిక కుటుంబాల సభ్యులు కన్నీంటి పర్యంతమయ్యారు. ఆనందంతో అక్కడున్నవారితో స్వీట్స్‌ పంచుకున్నారు. సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులను చిన్యాలిసౌర్‌ దవాఖానకు తరలించారు. కార్మికులు ఆరోగ్యంగా ఉన్నారా? లేదా? అన్నది పరిశీలించాక, వారిని స్వస్థలాలకు పంపనున్నారు.

అత్యాధునిక ఆగర్లు, ఇతర మిషన్లు విఫలమైనచోట ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌’ అద్భుతంగా పనిచేసిందని ‘నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ’ సభ్యుడు హస్నానీ వెల్లడించారు. ఈ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల్లో జార్ఖండ్‌ వాసులు అత్యధికంగా ఉన్నారు.  41మందిలో 15 మంది జార్ఖండ్‌ వాసులుకాగా, ఏడుగురు ఉత్తరప్రదేశ్‌, ఐదుగురు బీహార్‌, ఐదుగురు ఒడిశా, ముగ్గురు పశ్చిమ బెంగాల్‌, ముగ్గురు ఉత్తరాఖండ్‌, ఇద్దరు హిమాచల్‌ ప్రదేశ్‌, ఇద్దరు అస్సాం నుంచి ఉన్నారు.

నాలుగు పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రిల మధ్య రోడ్‌ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో కేంద్రం ‘చార్‌ధామ్‌’ ప్రాజెక్ట్‌ చేపట్టింది. దీంట్లో భాగంగానే 4.5 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మిస్తున్నది. ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా, దండల్‌గావ్‌లను కలిపేమార్గంలో ఇది ఉంది.  నవంబర్‌ 12న సిల్క్యారా వైపు నుంచి 205-260 మీటర్ల సొరంగానికి చెందిన ఒక భాగం ప్రమాదవశాత్తు కూలింది. దీంతో 260 మీటర్ల మార్క్‌కు అవతల కార్మికులు చిక్కుకుపోయారు.

గనుల్లో బొగ్గును దొంగలించడానికి కొంతమంది ఈ టెక్నిక్‌ను ఉపయోగిస్తారు. కేవలం ఒకే ఒక్క మనిషి పట్టేంత వెడల్పుతో సొరంగాన్ని తవ్వి.. బొగ్గును దొంగలించటాన్ని ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌’గా పేర్కొంటారు. ఈ టెక్నిక్‌తో మైనింగ్‌ చేయటం చట్టవిరుద్ధం. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 2014లో ఈ విధానంపై నిషేధం విధించింది.

టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది 17 రోజులుగా అలుపెరుగని పోరాటం చేశారు. తొలుత సొరంగంలోకి రంధ్రం చేసి బయటి నుంచి తాగునీరు, ఆహారం, ఔషధాలు లాంటివన్నింటినీ అందించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు అందజేశారు.

టన్నెల్‌లో 57 మీటర్ల వరకు తవ్వి, గొట్టపు మార్గాన్ని వేయగలిగితే కూలీల వద్దకు చేరుకోవచ్చని గుర్తించిన అధికారులు ఆ దిశగా ఆపరేషన్ చేపట్టారు. అయితే, కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. వర్షాలు, మంచు తదితర ప్రతికూల వాతావరణ పరిస్థితులు అడ్డంకులు సృష్టించాయి. అమెరికా నుంచి తెప్పించిన ఆగర్‌ యంత్రంతో డ్రిల్లింగ్‌ చేపట్టగా.. 47 మీటర్లు తవ్విన తర్వాత సొరంగంలో ఇనుపపట్టీ అడ్డు రావడంతో బ్లేడు విరిగిపోయింది.

ఈ దశలో ర్యాట్‌ హోల్‌ మైనర్లను రంగంలోకి దింపారు. వీరు మాన్యువల్‌గా డ్రిల్లింగ్ చేపట్టారు. ఇదే సమయంలో టన్నెల్‌లో చిక్కుకున్న ఆగర్‌ మిషన్‌ శిథిలాలను కట్టర్‌ సాయంతో తొలగించారు. సోమవారం రాత్రి నుంచి విరామం లేకుండా తవ్వకాలు చేపట్టడంతో 57 మీటర్ల డ్రిల్లింగ్‌ పూర్తయ్యింది. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించి అందులో నుంచి ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు.