కాంగ్రెస్ కర్ణాటక తరహా ప్రచారం బిజేపికి తోడ్పడుతుందా!

డా. వడ్డి విజయసారథి,
ప్రముఖ రచయిత, `జాగృతి’ పూర్వ సంపాదకులు

 అనేక చిన్న పెద్ద ఎన్జీవోలు కాంగ్రెసు, వామపక్షాల ప్రేరణతో కర్ణాటకలో భాజపాకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అయితే దానిని యథాతథంగా తెలంగాణలోఅన్వయించ టంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నవి.(ఈవిషయం విపులంగా తెలుసుకోరే వారు ఈరోజు ఆంధ్ర జ్యోతిలో ఆకునూరి మురళీకృష్ణ గారి వ్యాసం చూడండి)

కర్ణాటకలో భాజపా అధికార పక్షంగా ఉంది. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఉంది. మరొక ప్రతిపక్షమైన జనతా దళ్ (ఎస్) దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకుపరిమిత మై ఉంది. అబద్ధాలో,  సబద్ధాలో చెప్పి భాజపాను దోషిగా నిలబెట్టేందుకు కొన్ని వదంతులు ప్రచారంలో పెట్టారు. మరోవైపున కాంగ్రెసు రెండు ముఖాల ప్రచారం సాగించింది.

బహిరంగ సభల్లో ప్రసంగించిన నేతలద్వారా ఐదు వరాలను పదేపదే వల్లిస్తూ పేద, దిగువ మధ్య తరగతుల వారికి నోట్లో నీరు ఊరించే ప్రచారం పెద్ద ఎత్తున నడిపించింది. మరోవైపున కొందరు కీలక నేతలు ముస్లిం మైనారిటీల వద్దకు, కొందరు కులసంఘాల నేతలు వద్దకు వెళ్లి ఏవేవో వాగ్దానాలు చేసి రహస్య ఒప్పందాలు చేసుకున్నారు.

చిన్నచిన్నపార్టీలు, ప్రాంతీయ పార్టీలు నామినేషన్లు వేయకుండా సహకరించిన వారు కొందరైతే, నామినేషన్లు వేసినా, తమకు ప్రచారం చేసుకోకుండా, కాంగ్రెసు అభ్యర్థులకే వోట్లు వేయాలని చెప్పినవారు కొందరు. ఇవన్నీ కలిసి భాజపా బలాన్ని తగ్గించలేకపోయినా, విపక్షాలు వోట్లు కాంగ్రెసు ఖాతాలో జమ అయ్యేట్లు చేయగలిగారు. ఆ విధంగా భాజపా స్థానాలు 45 తగ్గేటట్లుగా, కాంగ్రెసు స్థానాలు యాబై పెరిగేటట్లుగా చేయగలిగారు. జనతాదళ్ (ఎస్) స్థానాలు కూడా గణనీయంగా తగ్గినవి ఇదీ కర్ణాటక కథ. 

ఈ మోడల్ ను తెలంగాణలో అమలుచేయవలసి వచ్చేసరికి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.  మొదటిది వారందరికీ ప్రథమ శత్రువు, ఉమ్మడి శత్రువు అయినా భాజపా ఇక్కడ అధికారంలో లేదు. ఇక్కడ అధికారంలో ఉండి అన్ని విధాలా దిగజారుతున్న బిఆర్ఎస్ మీద కాకుండా భాజపా మీద బాణాలు ఎక్కువ పెట్టినట్లయితే వారు క్రెడిబిలిటీని కోల్పోతారు.

పైగా బిఆర్ఎస్ చేసిన, చేస్తున్న అవినీతి పనులు, అక్రమాలు అవకతవకపనులు కొట్టవచ్చినట్లుగా కనబడుతున్నవి. దాంతో అనివార్యంగా వారు చేసే దాడిలో మొదటి వాక్యాలు బిఆర్ఎస్ గురించి చెప్పక తప్పటం లేదు.  వారిగురించి కొంత చెప్పి అతికేవో, అతకనివో  భాజపా గురించి కూడా కొన్ని చెప్పుతున్నారు.
ఆదానీకి లాభం చేకూర్చుతున్నారని, లక్షల్లో రూపాయలు అప్పులు కార్పొరేట్ సంస్థలు చెల్లించవలసిన అవసరం లేకుండా మాఫీ చేశారని సన్నాయి నొక్కుల రూపంలోనైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
భాజపాకు అనుకూలంగా వ్యవహరించే మీడియా  ఇక్కడ లేకున్నా, సోషల్ మీడియా కొంతలో కొంత చురుకుగా ఉండటంతో ఈ అసత్య ప్రచారం తేలిపోతున్నది.  బిఆర్ ఎస్ మీద చేస్తున్న విమర్శలు, బిజేపిమీదచేస్తున్న విమర్శలు ఒకేసారి విన్నపుడు, తమకున్న కొద్దిపాటి అనుభవం పూర్వకమైన జ్ఞానంతో ఒరిపిడి పెట్టిన చూసినపుడు వారందరికీ రెండు విషయాలు అర్థమౌతున్నవి. 
 
1) బిఆర్ఎస్ ను తప్పక సాగనంపాలి.
2)మరి ప్రభుత్వాన్ని ఎవరికి అప్పగించాలి అన్న ప్రశ్నకు సమాధానంగా భాజపా కనబడు తున్నది.
కర్ణాటక లో జరిగిన దానికి భిన్నంగా ఇక్కడ ఎందుకు పరిణ మిస్తుంది? ఇది ఆసక్తి దాయకమైన అంశం. కర్ణాటకలో కురుబ తదితర వెనుకబడిన కులాల్లో కాంగ్రెసుకు బలం ఉంది. కర్ణాటకలోని కొన్ని వెనుకబడిన కులాల వారిలో హిందుత్వవ్యతిరేక వాతావరణం ఉంది (దళిత్ వాయిస్ పత్రిక నడిపిన వీ.టీ. రాజశేఖర శెట్టి వంటివారు దశాబ్దాలుగా ఇటువంటి హిందూ వ్యతిరేకతను ఎగద్రోస్తున్నారు.
 
విదేశాలనుండి వస్తున్న డబ్బు ప్రభావం ఎలాగూ ఉంది. ఇలా నాలుగైదు వైపులనుండి చేసిన ప్రయత్నాల లోనుండి పదినుండి పదిహేను శాతం వరకు వోట్లను కాంగ్రెసుకు అదనంగా వేయించగలిగారు. ఆ ప్రయత్నం ఇక్కడ నెరవేరదు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజలముందున్న అనుభవాలనుండి బిఆర్ఎస్ పట్ల వ్యతిరేకత వ్యాపించింది కాని అది అంత సులభంగా  భాజపాపట్ల వ్యాపించదు. 

పదిహేడు సంవత్సరాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం (1997 తదుపరి) లో ముమ్మరం గా పాల్గొన్న వారు, నీళ్లు, నిధులు, నియామకాలు తమకు అనుకూలం కావాలని ఘోషించినవారు, ఆత్మహత్యలు చేసుకొన్నవారూ వెనుక బడిన వర్గాలకు చెందినవారు. వారి త్యాగాల పునాదుల పై సాధింప బడిన తెలంగాణ నేడు ఒక కుటుంబం చేతిలో బందీయై ఉండటం ఒక కఠోర వాస్తవం.

ఇక్కడ కాంగ్రెసు నాయకత్వం దశాబ్దాలుగా అగ్రకులం వారుగా పరిగణింపబడే ఒకే కులం వారి చేతిలో ఉండి పోయింది. బహుసంఖ్యాక ప్రజానీకం ఆటోమేటిక్ గా కాంగ్రెసు నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదు.  పైగా కాంగ్రెసు ఎంతగా తమను మోసగించగలదో, ఇక్కడ ప్రజలకు చాలాసార్లు అనుభవమైంది.(ఉదా : తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెసు 1971 లో సులభంగా విలీనం చేసుకొని ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి అడ్రసు లేకుండా చేసింది.)

భాజపా గురించి వ్యతిరేకంగా ఏదేదో చెప్పుదామని యత్నించినా అవి ఫలించలేదు. వెనుకబడిన వర్గాలలో ఆపార్టీకి పట్టు ఉండటం (వేర్లు కలిగి ఉండటం)ఒక కారణమైతే, తెలంగాణ ఉద్యమంలో 17 సంవత్సరాల పాటు చురుకుగా ఉండి రాష్ట్రాన్నిసాధించటంలో భాజపా ఒక పార్టీ గా కీలక పాత్ర వహించటం మరొక అంశం.

ఈసారి తెలంగాణకు వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్నకోరికను తాము సమర్థిస్తున్నామని కేంద్ర హోం మంత్రి, ప్రధానమంత్రి ప్రకటించినప్పుడు పార్టీ శ్రేణులు-ఏవిధమైన రపరపలు గాని, రుసరుసలుగానీ లేకుండా సహర్షంగా స్వీకరించటం కొంతమందికి ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు.
ఈ విధంగా ఏ మౌలిక సమస్యలు ఎత్తిచూపి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టాలో,  ఆ బాణాలు బిఆర్ఎస్ కి తగిలినవే కాని భాజపాకు తగిలే అవకాశం లేకపోయింది.

జాకీలు పెట్టి పైకి లేపుదామని చేసే ప్రయత్నాలను అందుకోగల స్థితిలో కాంగ్రెసు లేదు. అందుకోగల స్థితి ఎంతో కొంత భాజపాకు ఉన్నది. కాబట్టి బిఆర్ఎస్ ఎంత బలహీనపడుతుందో, ఆమేరకు భాజపా బలపడుతుందే కాని కాంగ్రెసు బలపడజాలదు. మరొక విషయం కూడాఉంది. గతంలో ప్రజా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవటం తమ వంతు అని వోటర్లు భావించేవారు. కాగా ఇప్పుడు పాలకులను తాముఎంపిక చేసుకొంటున్నామమనే స్పృహతో వ్యవహరిస్తున్నారు.

కాబట్టి ఎప్పుడైతే కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పరచడానికి (కర్ణాటకలో ఈ ఆరునెలలుగా ప్రజలు పడుతున్న పాట్లు వీరి దృష్టికి వస్తున్నవి గదా) పనికిరాదని నిర్ణయానికి వచ్చారో , అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీకి వోటు వేసిన వారు సైతం, ప్రభుత్వం ఏర్పరచే సమర్థత , దక్షత ఉన్న పార్టీ వైపు మళ్లుతారు.  ఆ విధంగా కాంగ్రెసువోట్ల శాతం పడిపోవటం, భాజపా వోట్లు శాతం మరింతగా పెరగటం  ఖాయం.  ఆ విధంగా ఇప్పుడు జరిగే తెలంగాణ ఎన్నికలు సామాన్యుల, విశ్లేషకుల ఊహకు అందని ఫలితాలకు బాట వేయనున్నవి.