రాహుల్ ద్రవిడ్ పదవీకాలాన్ని పొడిగించిన బిసిసిఐ

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) పొడిగించినట్లు బోర్డు ధృవీకరించింది. ద్రవిడ్ తోపాటు ఇతర సహాయ సిబ్బంది కూడా తమ పదవుల్లో కొనసాగనున్నారు.   ఐసీసీ వన్డే ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్‌తో బీసీసీఐ ప్రత్యేకంగా చర్చలు జరిపిందని.. ఈ మేరకు మరికొంతకాలం కోచ్‌గా సేవలు అందించాలని కోరినట్లు తెలుస్తోంది.
ఈ రెండేళ్ల కాలంలో టీమిండియా రాటుదేలడంలో రాహుల్ ద్రవిడ్ సేవలను బీసీసీఐ గుర్తించినట్లు బోర్డు ఆ ప్రకటనలో తెలిపింది. ద్రవిడ్ తోపాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా కొనసాగనున్నారు. అయితే ద్రవిడ్ ఎన్నాళ్లు ఆ పదవిలో కొనసాగనున్నాడన్నది మాత్రం బోర్డు వెల్లడించలేదు.
ఇది కనీసం వచ్చే ఏడాది జూన్, జులైలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ వరకైనా ఉంటుందని భావిస్తున్నారు. నవంబర్, 2021లో టీ20 ప్రపంచకప్ తర్వాత  కోహ్లీ, ర‌విశాస్త్రిలు సార‌థి, హెడ్‌కోచ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలో రోహిత్‌, ద్రావిడ్‌ను నియ‌మించిన విష‌యం తెలిసిందే. రెండేళ్లపాటు అతనితో బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ కప్‌లో భారత్ రెండవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అది ఈ మధ్యే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ముగిసింది.

మరోవైపు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్, సహాయక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ సేవలను కూడా బీసీసీఐ అభినందించింది. ద్రవిడ్, లక్ష్మణ్ తమ భాగస్వామ్యాలతోనే కాకుండా తమ కోచింగ్ సేవలతో భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారని బీసీసీఐ అభిప్రాయపడింది.  అటు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కూడా ద్రవిడ్ సేవలపై ప్రశంసలు కురిపించారు.

ద్రవిడ్ దార్శనికత, వృత్తి నైపుణ్యం, లొంగని నైజం టీమిండియా విజయంలో మూలస్తంభాలుగా ఉన్నాయని రోజర్ బిన్నీ కొనియాడారు. ద్రవిడ్, లక్ష్మణ్ సవాళ్లను స్వీకరించడమే కాకుండా వాటిని సాధిస్తూ ముందుకు సాగిపోతున్నారని, అందుకే టీమిండియా మంచి ప్రదర్శన చేస్తోందని తెలిపారు. కోచ్‌గా కొనసాగాలని బీసీసీఐ చేసిన ప్రతిపాదనకు అంగీకారం తెలిపినందుకు ద్రవిడ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్‌లో ద్రవిడ్ మార్గదర్శకత్వంలో టీమిండియా మరిన్ని విజయాలు సాధిస్తుందని రోజర్ బిన్నీ అభిప్రాయపడ్డారు.

వాస్త‌వానికి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత ద్రావిడ్ రెండేండ్ల కాంట్రాక్టు ముగిసిన నేప‌థ్యంలో భార‌త్ కొత్త కోచ్ కోసం ప్ర‌య‌త్నాలు చేసింది. రాహుల్ ద్రావిడ్ గైర్హాజరీలో భార‌త జ‌ట్టు హెడ్‌కోచ్ బాధ్య‌త‌లు మోస్తున్న హైద‌రాబాదీ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ తో పాటు ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ను న‌డిపిస్తున్న ఆశిష్ నెహ్రాల‌ను గానీ ఎంపిక చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు గుస‌గుస‌లు వినిపించాయి.

ఈ ఇద్ద‌రూ కాకుంటే విదేశీ కోచ్‌ల వైపు కూడా చూడొచ్చ‌న్న వాద‌న‌లు వ‌చ్చాయి. కానీ వీవీఎస్‌కు ఇప్ప‌టికే ఎన్సీఏ బాధ్య‌త‌లు ఉండ‌గా నెహ్రా కూడా ఐపీఎల్‌తో పాటు ఇత‌ర బాధ్య‌తల కార‌ణంగా హెడ్‌కోచ్ ప‌దవికి విముఖ‌త చూపించ‌డంతో ద్రావిడ్‌నే కొన‌సాగించేందుకు అత‌డిని ఒప్పించిన‌ట్టు స‌మాచారం. ఇక సౌతాఫ్రికా టూర్ కు వెళ్లే టీమిండియాతో హెడ్ కోచ్ గా ద్రవిడే వెళ్తాడు. డిసెంబర్ నెలలో సౌతాఫ్రికా టూర్ కు ఇండియన్ టీమ్ వెళ్లనుంది. ఇందులో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. డిసెంబర్ 10న టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.