రిషికొండ అక్రమ కట్టడాలపై కేంద్ర బృందం పరిశీలన

 
విశాఖపట్టణంలోని రిషికొండపై పర్యావరణ అనుమతులను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం కార్యాలయాలను తరలించేందుకు ఒకవంక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హడావుడిగా సన్నాహాలు చేస్తుండగా, మరోవంక న్యాయపరమైన చిక్కులు వెంటాడుతున్నాయి.  వైజాగ్ రుషికొండపై గతంలో అనుమతించిన పరిమితికి మించి భవనాలు నిర్మించిన వ్యవహారంలో హైకోర్టు బుధవారం మరోసారి విచారణ జరిపింది. 
 
దీనికి హాజరైన కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు డిసెంబర్ మొదటివారంలో రుషికొండ పరిశీలనకు కేంద్ర బృందం వెళ్తుందని తెలిపారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు  సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు ఉల్లంఘించి రుషికొండపై జరిపిన నిర్మాణాలపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్రం తెలిపింది.
 
రుషికొండపై జరిపిన నిర్మాణాల ప్రభావం పర్యావరణంపై ఏమేరకు ఉంటుందనే విషయంపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ(ఎంవోఈఎఫ్‌) నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఈ కమిటీ డిసెంబరు తొలివారంలో క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇస్తుందని, దాని ఆధారంగా కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయం తీసుకుంటుందని వివరించింది. 
 
 హెచ్‌టువో ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ సలహాదారు కె. గౌరప్పన్‌ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారని కేంద్రం తరఫు న్యాయవాది జూపూడి యజ్ఞదత్‌ హైకోర్టుకు వివరించారు.  కేంద్ర పర్యావరణ అటవీ శాఖ శాస్త్రవేత్త డాక్టర్‌ పసుపులేటి సురేశ్‌బాబు మెంబర్‌ సెక్రెటరీగా, కోస్తా ప్రాంత సుస్థిర నిర్వహణ జాతీయ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ మానిక్‌ మహాపాత్ర, విశాఖపట్నం సీపీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు శాస్త్రవేత్త డి. సౌమ్య కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారని కేంద్రం తరఫు న్యాయవాది వివరించారు. 
 
ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను డిసెంబరు 27కి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌. రఘునందనరావు కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. మరోవైపు సీఎం వైఎస్ జగన్ విశాఖకు డిసెంబర్ మొదటివారంలో వస్తారని ఉత్తరాంధ్ర మంత్రులు, వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్నారు. 
 
ఇప్పుడు రుషికొండపై కట్టడాల పరిశీలనకు కేంద్ర బృందం వస్తున్న నేపథ్యంలో జగన్ అక్కడికి మారతారా? లేక తన తరలింపును మరోసారి వాయిదా వేసుకుంటారా? అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే అక్రమ కట్టడాల పరిధిలోకి వచ్చే భవనంలోకి జగన్ మారితే కేంద్ర బృందం విచారణ సందర్భంగా సమస్యలు తప్పవు.

 
దీంతో హైకోర్టుకు కేంద్రం చెప్పిన విధంగా డిసెంబర్ మొదటి వారంలో కేంద్ర బృందం రుషికొండను పరిశీలించి వెళ్లిపోయాక జగన్ అక్కడికి తరలివెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా ముందుగా వెళ్లాలని భావిస్తే మాత్రం ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రుషికొండ కట్టడాలపై కేంద్ర బృందం పరిశీలన, నివేదిక వచ్చాక డిసెంబర్ 27న తదుపరి విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది.