అమెరికా వెళ్లే విద్యార్థులకు కొత్త నిబంధనలు

విద్యార్థి వీసాలపై అమెరికా ప్రభుత్వ యంత్రాంగం నూతన నిబంధనలు తీసుకువచ్చింది. ఈ వీసా రూల్స్ తక్షణం అమలులోకి వస్తాయి. ఈ సరికొత్త నిబంధనలకు సంబంధించి న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ నుంచి కూడా ప్రకటన వెలువడింది.  వీసా దరఖాస్తుల్లో మోసాల నియంత్రణకు, ఉద్యోగ నియామక పద్ధతుల కట్టడికి వీలుగా ఈ నూతన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చినట్లు రాయబార కార్యాలయం సోమవారం ఓ ప్రకటన వెలువరించింది.

అమెరికా వీసాలకోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వీటిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది అమెరికా వీసాలలో అత్యధిక భాగం భారతీయ విద్యార్థులకు జారీ చేశారు. ఇది ఓ రికార్డు అయింది. ఇప్పటి రూల్స్ ఎఫ్, ఎం, జె స్టూడెంట్ వీసాల దరఖాస్తుదారులు దృష్టిలో పెట్టుకుని తీరాల్సి ఉంటుంది. నవంబర్ 27వ తేదీ సోమవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. 

వీసా అపాయింట్మెంట్లు, ప్రొఫైల్స్ తయారీ దోవలో  తమ సొంత పాస్‌పోర్టు నంబర్‌తో ప్రొఫైల్‌ తయారుచేసి పంపాలని సూచించింది. ఇప్పుడు తీసుకువచ్చిన సరికొత్త నిబంధనలు ఇవే అమెరికాలో చదువులకు ఎఫ్, ఎం, జె స్టూడెంట్ వీసా పరిధిలో దరఖాస్తులు చేసుకునే విద్యార్థులు తప్పుడు పాస్‌పోర్టు నెంబరు లేదా సమాచారం ఇచ్చినట్లు అయితే ఈ విధంగా వారు తప్పుడు ప్రొఫైల్ లేదా వీసాల అపాయింట్మెంట్లు కోరితే అటువంటి వారి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. 

వారి దరఖాస్తుల క్రమంలో దక్కే ఇంటర్వూల అవకాశం , ఇదే దశలో వారి వీసా ఫీజు స్తంభింపచేస్తారని యుఎస్ ఎంబసీ తెలిపింది. ఈ మేరకు జాగ్రత్తలు వెలువరించింది. ఇక టైప్ ఎఫ్ లేదా టైప్ ఎం వీసాలకు దరఖాస్తు చేసుకునే వారు విధిగా సంబంధిత స్టూడెంట్స్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ప్రోగ్రాం (ఎస్‌ఇవిపి) నమోదిత లేదా సర్టిఫై చేసిన స్కూలు లేదా విద్యా కోర్సుకు హాజరు కావల్సి ఉంటుంది.  కాగా టైప్ జె వీసాలకు దరఖాస్తు చేసుకునే వారు వీసాలు పొందాలంటే తప్పనిసరిగా విదేశాంగ శాఖ ఆమోదిత సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్ పొంది ఉండాల్సిందే.