మధ్యప్రాచ్యంలో జీపీఎస్‌ సిగ్నల్స్‌ కోల్పోతున్న విమానాలు

మధ్యప్రాచ్యం ప్రాంతాలపై ఎగురుతున్న పౌర విమానాలు జీపీఎస్‌ సిగ్నల్స్‌ను కోల్పోతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌ సమీపంలో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది.  గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ (జీపీఎస్‌) సిగ్నల్స్ జామింగ్, స్పూఫింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలను అలెర్ట్‌ చేసింది.
అలాగే దీనిని నివారించడంతోపాటు, విమానాలకు వాటిల్లే ముప్పును ఎదుర్కొనేందుకు తగిన సూచనలు జారీ చేసింది. జీపీఎస్‌ వ్యవస్థల పర్యవేక్షణ, విశ్లేషణ నెట్‌వర్క్‌ను రూపొందించాలని కోరింది.  కాగా, ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం నేపథ్యంలో  మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు మిలిటరీ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లను యాక్టివేట్‌ చేశాయి. దీని వల్ల ఆ ప్రాంతం మీదుగా వెళ్లే విమానాల్లోని జీపీఎస్ వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదు. 

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ నెలాఖరులో ఇరాన్‌కు సమీపంలో ప్రయాణించిన పలు వాణిజ్య విమానాలు దారి తప్పాయి. స్పూఫింగ్‌కు గురైన ఒక విమానం అనుమతి లేకుండా ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించింది. మరోవైపు రద్దీగా ఉండే వాయు మార్గమైన ఉత్తర ఇరాక్‌, అజర్‌బైజాన్‌, ఎర్బిల్‌ సమీపంలో చాలా విమానాలు జీపీఎస్‌ను కోల్పోయాయి. 

సెప్టెంబర్‌లో 12 సంఘటనలు నమోదయ్యాయి. తాజాగా నవంబర్ 20న టర్కీ రాజధాని అంకారా సమీపంలో ఒక విమానంలో ఈ సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో పౌర విమానాలు జీపీఎస్‌ సిగ్నల్స్‌ కోల్పోవడంపై డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) మార్గదర్శకాల మేరకు భారతీయ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్ సంస్థలను దీని గురించి అప్రమత్తం చేసింది.