తెలంగాణ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సజావుగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషుల  కంటే మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈసారి మొదటిసారి ఇంటి నుంచే ఓటింగ్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 

యువ ఓటర్లు 9 లక్షలకు పైగా ఉన్నారని, పోస్టల్ బ్యాలెట్లు 4లక్షలు, ఈవీఎం బ్యాలెట్లు 8 లక్షల 84వేలు ప్రింట్ చేసినట్లు పేర్కొన్నారు. ఎపిక్ కార్డులు 51 లక్షలు ప్రింట్ అయ్యి దాదాపు పంపిణీ అయ్యాయి. రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు వచ్చినట్లు ప్రతి లెక్కింపు కేంద్రంకు ఒక పరిశీలకులు ఉంటారని వెల్లడించారు. 

మూడు కేటగిరీల్లో ఇంటి వద్దే ఓటింగ్ విధానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వాళ్లు 9300 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు, 2 కోట్ల 81లక్షల ఓటర్ గుర్తింపు పత్రాల పంపిణీ పూర్తి అయినట్లు  పేర్కొంటూ శుక్రవారం నాటికి ఓటర్ స్లిప్ పంపిణీ పూర్తి అవుతుందని తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు 59వేల బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు చెప్పారు. సీ విజిల్ యాప్ ద్వారా 6,600 ఫిర్యాదులు అందినట్లు, ఫ్లయింగ్ స్వ్కాడ్ వాహనాలకు జిపిఎస్ ఉంటుందని, ప్రతి నియోజకవర్గానికి మూడు ఎస్‌ఎన్టీ, ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

తెలంగాణలో ఎన్నికల కోసం 377 కంపెనీల కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 64 వేల మంది రాష్ట్ర పోలీసులు, 375 కేంద్ర కంపెనీల నుంచి బలగాలు ఎన్నికల కోసం సిద్దంగా ఉన్నాయని వివరించారు.

ఎన్నికల నిర్వహణతో పాటు డిసెంబర్‌ 3న జరిగే కౌంటింగ్‌కు సంబంధించి పక్కా చర్యలు తీసుకున్నారు.  హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ఒకే చోట లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లు నమోదైన ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కింపు కేంద్రాలకు తరలించేలా ఇప్పటికే రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. తరలించిన ఆనంతరం నిరంతరం సీసీ కెమెరాల నిఘా నడుమ.. భద్రత సిబ్బంది ఉండేలా ప్రణాళిక రూపొందించారు.