కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఓ ముఖ్యమంత్రి

కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కలలు కంటుందని చెబుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఓ ముఖ్యమంత్రి వస్తాడని కేంద్ర మంత్రి, బిజెపి రాష్త్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్.. ఆ పార్టీ ఏ రాష్ట్రంలో ఉంటే అక్కడ అవినీతే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ అవినీతిని పెంచి పోషించగా,  ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ ధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు.  గాడిలో పెట్టాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాలని స్పష్టం చేశారు. ఐదు గ్యారెంటీలు అమలు చేయడంలో మేం వైఫల్యం చెందామని బహిరంగంగా కర్ణాటక కాంగ్రెస్ మంత్రులు క్షమాపణ చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఫ్యామిలీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలని చెబుతూ  అవినీతి, బంధుప్రీతి, కుటుంబ పాలన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నినాదం అని విమర్శించారు.  బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని చెబుతూ గతంలో బీసీ సంఘాల నేతలు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే, మంత్రి కావాలని కోరుకునేవారని, అయితే ఇప్పుడు బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. 

‘‘ఇన్నేళ్ల తర్వాత బీసీలకు మేలు చేసేందుకు సీఎంని చేయాలని బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంది. బీసీ సంఘాలు సమావేశం అయిన తర్వాత మాకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ సాధనలో బీసీ ఉద్యమాలు చేసిన తరహాలో బీసీని సీఎం చేసేందుకు ముందుకు వస్తున్నారు” అని చెప్పారు. 

బీజేపీ పార్టీకి అత్యధిక బీసీ ఎమ్మెల్యేలు, 27మంది కేంద్ర మంత్రులు బీసీలే ఉన్నారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలను బీజేపీ రాష్ట్రపతిలను చేసిందని చెబుతూ కాంగ్రెస్ ఏనాడూ చిత్తశుద్దితో సామాజిక న్యాయం కోసం పని చేయలేదవిమరసంచారుని . బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా? అని ప్రశ్నించారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీసీలను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడైనా దళితుడిని సీఎం చేస్తారా..? కుమారుడు సీఎం, మనవడు ప్రధాని అయినట్టు కేసీఆర్ ఫాంహౌస్‌లో కలలు కుంటున్నాడని అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.