హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ఉదయం నుంచి నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. దీంతో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.  హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి ఈ నెల 26 వరకు వానలు కురుస్తాయని పేర్కొంది.

ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం వల్ల రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవంక, బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌, పరిసర ప్రాంతాల్లో ఈ నెల 25న తుఫాన్ ఆవర్తనం చెందే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఈ ప్రభావంతో ఈ నెల 26 నాటికి ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపారు. అనంతరం అది పశ్చిమ- వాయవ్య దిశగా ప్రయాణించి ఈశాన్య బంగాళాఖాతం, అండమాన్‌ పరిసరాల్లో ఈ నెల 27 నాటికి వాయుగుండంగా బలపడతుందని పేర్కొన్నారు. 

తమిళనాడు, కేరళ పరిసరాల్లో సముద్రమట్టానికి 3.1 కి.మీ.ఎత్తులో మరో తుఫాన్ ఆవర్తనం కొనసాగుతోందన్నారు. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు బలపడి వాయువ్యంగా పయనించి ఒడిశా, ఏపీ, తమిళనాడుతీరం దిశగా వస్తుంటాయి. ఈ ఏడాదివచ్చిన రెండు తుఫాన్లు అసాధారణంగా బంగ్లాదేశ్‌ వైపు వెళ్లిపోయాయి. వచ్చే వారం ఏర్పడే వాయుగుండం కూడా బంగ్లాదేశ్‌ దిశగానే వెళుతుందని అంచనా వేస్తున్నారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, గత కొన్ని రోజులుగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. తమిళనాడులోని చెన్నై సహా పలు జిల్లాల్లో బుధవారం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం పడుతోంది. దీంతో ఆయా జిల్లాల యంత్రాంగం విద్యా సంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించింది. పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది.కేరళలోనూ భారీ వర్షం కురుస్తోంది. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రానున్న రోజుల్లో పతనంతిట్టతోపాటు మరో రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

మరోవైపు భారీ వర్షం కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల వెళ్లే రహదారిపై కొండచరిలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.