జ‌మ్మూక‌శ్మీర్‌లో పాక్ కీలక ఉగ్రవాది హతం

ఐఈడీ బాంబుల త‌యారీలో నిష్ణాతుడైన పాకిస్థాన్ ఉగ్ర‌వాది క్వారి గురువారం జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మృతిచెందాడు. ఆ ఉగ్ర‌వాది స్నైప‌ర్‌గా కూడా శిక్ష‌ణ పొందాడు. ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌లో అత‌ను స్నైప‌ర్‌గా శిక్ష‌ణ తీసుకున్నాడు. పాకిస్థాన్‌-ఆఫ్ఘ‌నిస్తాన్ సరిహద్దులో అత‌ను త‌న కార్య‌క‌లాపాల‌ను సాగించాడు. 

కాలాకోట్ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, తీవ్రవాదులు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో నలుగురు సైనికులు అమరులైన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు కెప్టెన్లు కూడా ఉన్నారు. రాత్రిపూట ఆగిపోయిన కాల్పులు మళ్లీ గురువారం ఉదయం నుంచి మొదలుకాగా ఈ కాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన కీలక ఉగ్రవాది హతమైనట్టు రక్షణ శాఖ పబ్లిక్ రిలేషన్స్ అధికారి పేర్కొన్నారు.

ఎదురుకాల్పుల్లో మ‌ర‌ణించిన ఉగ్ర‌వాదిని క్వారిగా గుర్తించారు. అత‌ను పాక్ జాతీయుడ‌ని, గ‌త ఏడాది నుంచి రాజౌరీ- పూంచ్ ప్రాంతాల్లో అత‌ను క్రియాశీలకంగా ఉన్నాడని తెలిపారు. దంగ్రీ, కండి దాడుల‌కు అత‌నే కీల‌క వ్య‌క్తి అని విశ్వ‌సిస్తున్నారు. అతడు ఐఈడీల్లో నిపుణుడని, గుహల నుంచి ఆపరేట్ చేయడం, దాక్కోవడంతో పాటు శిక్షణ పొందిన స్నిపర్ అని తెలిపారు.

రాజౌరీ ప్రాంతంలో మ‌ళ్లీ ఉగ్ర‌వాదానికి జీవం పోసేందుకు అత‌న్ని అక్క‌డ‌కు పంపిన‌ట్లు తెలుస్తోంద‌ని ప్ర‌తినిధి తెలిపారు. ఐఈడీ బాంబుల‌ను పేల్చ‌డంలో అత‌ను నిష్ణాతుడు. గుహ‌ల్లో దాక్కుని ఐఈడీల‌ను అత‌ను ఆప‌రేట్ చేస్తుంటాడు. స్నైప‌ర్‌గా కూడా శిక్ష‌ణ పొందాడు.