కెనడా పౌరులకు ఈ-వీసా సేవల పునరుద్ధరణ

భారత, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రికతలు కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రెండు నెలలుగా కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ-వీసా సేవలను భారత్ పునరుద్ధరించింది. గత జూన్‌లో ఖలిస్థాన్ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నజ్జర్ హత్య వెనుక ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో గత సెప్టెంబర్ నుంచి ఒట్టావోతో భారత్ దౌత్య సంబంధాలు క్షీణించాయి. 
 
కెనడా ఆరోపణలను నిరాధారమని ఇండియా తోసిపుచ్చింది. ఇరు దేశాలు దౌత్యవైత్యలను తమ దేశాన్ని విడిచిపెట్టాల్సిందిగా ఆదేశించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో కెనడా పౌరులకు గత సెప్టెంబర్ 21 నుంచి నిలిపివేసిన ఈ-వీసా సేవలను భారత్ బుధవారంనాడు పునరుద్ధరించింది. జీ-20 దేశాధినేతల వర్చువల్ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడటం విశేషం.
 
ట్రూడో ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కెనడాలో వీసాల జారీ ప్రక్రియను సెప్టెంబర్‌ 21వ తేదీ నుంచి భారత్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. 
 
అయితే, కెనడా ప్రభుత్వం ఇటీవల చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సమీక్షించిన అనంతరం ఇంచుమించు నెల రోజుల తర్వాత భారత్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంది. అక్టోబర్‌ 26వ తేదీ నుంచి ఎంట్రీ వీసా, బిజినెస్‌ వీసా, మెడికల్‌ వీసా, కాన్ఫరెన్స్‌ వీసా సర్వీసులను పునరుద్ధరించింది. ఇప్పుడు తాజాగా ఈ-వీసా సేవలను కూడా పునరుద్ధరించారు.
 
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన జీ-20 సమావేశం విజయవంతం కావడం, ఏకగ్రీవంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న క్రమంలో జీ-20 దేశాధినేతల వర్చువల్ సదస్సు బుధవారం జరుగనుంది. ఈ వర్చువల్ మీట్‌లో జస్టిన్ ట్రూడో పాల్గొనే విషయంలో సందిగ్దత నెలకొన్నప్పటికీ, ఆయన వర్చువల్ మీట్‌లో పాల్గొంటారని ఒట్టావా స్పష్టత ఇచ్చింది.