చైనాలో కొత్త మ‌హ‌మ్మారి…వేలల్లో ఆసుపత్రులలో చిన్నారులు

కరోనా వ్యాప్తి నుండి ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్న చైనా ప్రస్తుతం కొత్త మహమ్మారి ముప్పును ఎదుర్కొంటోంది. చైనాలోని పాఠశాలల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మిస్టీరియస్ న్యుమోనియా ఇక్కడ విస్తరిస్తోంది. దీని కారణంగా భారీ సంఖ్యలో పిల్లలు ఆసుపత్రులలో చేరుతున్నారు.
 
అయితే, ఇది న్యూమోనియా కాదని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో సమస్య ఈ వ్యాధిలో ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. ఈ సమస్యలతో బాధ పడుతున్న వేలాది మంది చిన్నారులను ఆసుపత్రులతో చేరుస్తున్నారు. కరోనా ప్రారంభ దశ వలె, ఆసుపత్రులలో రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుండడంతో ఆరోగ్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
 ఎక్కువ మంది రోగులు చేరడం వల్ల ఆసుపత్రి వనరులపై విపరీతమైన ఒత్తిడి ఉందని ఇక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ వ్యాధి బారిన పడిన పిల్లలు ఊపిరితిత్తులలో వాపు, అధిక జ్వరంతో బాధపడుతున్నారు.   ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందని వెల్లడించారు. కరోనా ఆంక్షలను ఎత్తివేసిన తరువాత, పిల్లల్లో సాధారణంగా వచ్చే ఇన్ ఫ్లుయెంజా వంటి ఇన్ఫెక్షన్లు పెరిగాయని తెలిపింది.
 
న్యూమోనియా లక్షణాలతో అంతు చిక్కని వ్యాధి పిల్లల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ సమస్య అధికంగా ఉన్న ఉత్తర చైనా ప్రాంతంలో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఉండడం కోసమే ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు.  చైనాలో న్యూమోనియా లక్షణాలతో అంతు చిక్కని వ్యాధి వ్యాప్తి చెందుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
ముఖ్యంగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడుతుండడం ఆందోళనకరమని పేర్కొంది. ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ వ్యాధికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని చైనా ఆరోగ్య శాఖను కోరింది. వ్యాధి సోకినవారిని ఐసోలేట్ చేయడం, మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
చైనాలో వ్యాపిస్తున్న ఈన్యుమోనియా వ్యాధి గురించి ప్రోమెడ్ బయటపెట్టింది. ప్రోమెడ్ అనేది ప్రపంచ దేశాల్లో మనుషులు, జంతువుల్లో వ్యాపించే వ్యాధుల గురించి ట్రాక్ చేసే సర్వైవలెన్స్ ప్లాట్‌ఫామ్. ఈ ప్రోమెడే చైనాలోని న్యుమోనియో వ్యాప్తి గురించి బయటి ప్రపంచానికి చెప్పింది. 2019లో చైనాలో పుట్టిన కరోనా గురించి ఈ ప్రోమెడ్ సంస్థనే మొదట బయటపెట్టింది. 
 
అయితే చైనాలో ప్రస్తుత న్యుమోనియా వ్యాధి ఎప్పుడు మొదలైందనే విషయం స్పష్టంగా తెలియదని ప్రోమెడ్ తెలిపింది. అయితే ఈ న్యుమోనియా కూడా మరో కరోనా మహమ్మారి మాదిరిగా మారుతుందా? లేదా అనేది కూడా ఇప్పుడే చెప్పలేమని వివరించింది.