అమెరికాలోని అక్రమ వలస దారుల్లో మూడో స్థానంలోభారతీయులు

అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలస దారుల్లో భారతీయులు మూడో స్థానంలో ఉన్నట్లు తాజాగా సర్వే తెలిపింది. అమెరికాలో మెరుగైన జీవనోపాధి, విస్తృత అవకాశాల కారణంగానే వివిధ దేశాల నుంచి ఎలాగైనా ఆ దేశంలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల జనాభాలో భారతీయులు మూడో స్థానంలో ఉన్నట్లు తేలింది. 
 
వాషింగ్టన్‌కు చెందిన థింక్ ట్యాంక్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. అమెరికాలో ప్రస్తుతం 7.25 లక్షల మంది భారతీయలు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నివసిస్తున్నారని తేలింది.  ఇక అత్యధికంగా మెక్సికో నుంచి 2017-2021 మధ్య అక్రమ వలసదారులు అమెరికాలోకి చేరినట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. 
 
ఆ తర్వాత 8 లక్షల మంది అక్రమ వలసదారులు ఎల్ సాల్విడార్‌ నుంచి అమెరికాలోకి చొరబడినట్లు తేలింది. 2017 నుంచి అక్రమంగా అమెరికాలోకి చేరుతున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధ్యయనంలో తేలింది.  మొత్తంగా అమెరికాలో అనధికార వలస జనాభా 2021 లో 1 కోటీ లక్షలకు చేరుకుంది.
ఇక 2007 లో అత్యధికంగా 1 కోటీ 22 లక్షల మంది ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. గత ఏడాది అక్టోబరు 1 వ తేదీ నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 30 వ తేదీ మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నం చేసి దొరికిపోయిన భారతీయుల వివరాలను అమెరికా విడుదల చేసింది. 
 
మొత్తం 96,917 మంది భారతీయులు ఎలాంటి అనుమతులు లేకుండా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించి దొరికిపోయారని, వారిని అరెస్టు చేశామని అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ 97 వేల మందిలో 30 వేల మంది కెనడా సరిహద్దు వద్ద,  దాదాపు 42 వేల మంది మెక్సికో సరిహద్దు వద్ద పట్టుబడినట్లు తెలిపింది.

గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి అమెరికాలోకి అక్రమంగా వలసలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరేబియన్, దక్షిణ అమెరికా, ఆసియా, యూరప్, సబ్ సహారా, ఆఫ్రికా నుంచి అనధికార వలసలు పెరిగాయని పరిశోధకులు తెలిపారు. అమెరికా అక్రమ వలసదారుల్లో వెనుజులా, బ్రిజిల్, కెనడా, మాజీ సోవియట్ దేశాలు, చైనా, డొమినికన్ రిపబ్లిక్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు.