సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి కన్నుమూత

సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసిన  ఫాతిమా బీవీ (96) ఇక లేరు. ఆమె కొల్లాంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం కన్నుమూశారు. ఫాతిమా బీవీ వయసు 96 ఏళ్లు. తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా కూడా ఆమె సేవలు అందించారు.  సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆమె తమిళనాడు గవర్నర్ గా కూడా పని చేశారు.
గవర్నర్ గా పనిచేసిన తొలి ముస్లిం మహిళా ఆమే కావడం విశేషం. జస్టిస్ ఫాతిమా బీవీ మృతి పట్ల కేరళ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది.  జస్టిస్ ఫాతిమా బీవీ కేరళలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి తన బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీని పొందారు. 1927లో కేరళలోని పఠనంతిట్టలో జన్మించిన ఆమె 1950లో కేరళలో లా డిగ్రీ పొందిన మొదటి ముస్లిం మహిళగా గుర్తింపు పొందారు.
1950, 14 నవంబర్ 14న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఆమె 1950లో కేరళ దిగువ న్యాయవ్యవస్థలో తన వృత్తిని ప్రారంభించారు. ఆ తరువాత, త్వరలోనే కేరళ సబార్డినేట్ జ్యుడీషియల్ సర్వీసెస్‌లో మున్సిఫ్‌గా జాయిన్ అయ్యారు. 

అనంతరం, సబార్డినేట్ జడ్జిగా, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌గా, జిల్లా-  సెషన్ జడ్జిగా పదోన్నతులు పొందారు. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యురాలిగా కూడా ఆమె వ్యవహరించారు. జస్టిస్ ఫాతిమా బీవీ 1983లో హైకోర్టు న్యాయమూర్తిగా, 1989లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతులు పొందారు. 

భారతీయ ఉన్నత న్యాయవ్యవస్థలో నియమితులైన మొదటి ముస్లిం న్యాయమూర్తిగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. పదవీ విరమణ తర్వాత, జస్టిస్ ఫాతిమా బీవీ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. ఆ తరువాత ఆమె తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. కేరళ వెనుకబడిన కులాల కమిషన్ చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. ఆమెకు భారత్ జ్యోతి అవార్డు, యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్  లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు లభించాయి.