అల్ ఫిషా ఆస్పత్రిలో విదేశీ బందీలు..ఆస్పత్రిలో సొరంగం

గాజా లోని అతిపెద్ద ఆస్పత్రి “అల్‌షిఫా” ని హమాస్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా వాడుకుంటున్నారని ఇజ్రాయెల్ పదేపదే ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు బలమైన సాక్షాలను బయటపెడుతోంది. తాజాగా ఈ ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన ఓ వీడియోను ఐడిఎఫ్ ఎక్స్ వేదికగా విడుదల చేసింది. 

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత ఆ దేశం నుంచి కిడ్నాప్ అయిన కొంతమందిని అల్ బంధించేందుకు తీసుకురావడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. అక్టోబర్ 7న ఉదయం 10.42 నుంచి 11 గంటల మధ్య అల్‌షిఫా ఆస్పత్రి సిసీటివి కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను ఐడీఎఫ్ విడుదల చేసింది. అందులో చేతిలో ఆయుధాలతో ఉన్న హమాస్ ఉగ్రవాదులు ఓ వ్యక్తిని బలవంతంగా ఆస్పత్రి లోపలికి లాక్కొస్తున్నట్టుగా ఉంది. 

తీవ్రంగా గాయపడిన మరో బందీని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్తున్నట్టుగా వీడియోలో రికార్డ్ అయ్యింది. దీనిపై ఐడీఎఫ్ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ స్పందిస్తూ  ఆ బందీలు నేపాల్, థాయ్‌లాండ్ దేశస్థులని తెలియజేశారు. “ఇప్పుడు ఆ ఇద్దరు ఎక్కడ ఎలా ఉన్నారో ఇంకా తెలియలేదు. ఇజ్రాయెల్‌పై నరమేధం జరిపిన రోజున అల్‌షిఫా ఆస్పత్రిని వారు వినియోగించుకున్నారని మాత్రం స్పష్టమైంది” అని ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇజ్రాయెల్ దళాలు ఆస్పత్రి కింద ఓ సొరంగాన్ని తాజాగా గుర్తించాయి. 10 మీటర్ల లోతులో 55 మీటర్ల పొడవులో ఈ టన్నెల్ ఉన్నట్టు ఐడీఎఫ్ తెలిపింది. ఈ మేరకు వీడియోను విడుదల చేసింది. గాజా ప్రజలను, ఆస్పత్రి రోగులను “మానవ కవచాలు” గా తమకు రక్షణ కోసం హమాస్ వినియోగించుకుంటోందని ఐడీఎఫ్ ఆరోపించింది.

బాంబు దాడుల్లో  40 మంది జర్నలిస్టులు మృతి

కాగా, ఇజ్రాయిల్‌ దాడుల్లో గడిచిన 24 గంటల్లో నలుగురు జర్నలిస్టులు, ముగ్గురు స్థానిక మీడియా కార్మికులు మరణించారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ జరిపిన లక్షిత బాంబు దాడుల్లో సుమారు 40 మంది జర్నలిస్టులు మరణించారు. సెంట్రల్‌ గాజాలోని అల్‌ బురీజ్‌ శరణార్థి శిబిరంపై జరిపిన బాంబుదాడిలో అక్కడ ఆశ్రయం పొందుతున్న సారి మన్సూర్‌, హసౌనెహ్ సలీంలు మరణించారు.

బిబిసికి చెందిన మరో ప్రముఖ పాత్రికేయుడు, పాలస్తీనా రాజకీయ వ్యవహారాల విశ్లేషకుడు ముస్తఫా అల్‌ సవాఫ్‌ మరణించారు.  అతని నివాసం లక్ష్యంగా ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన బాంబు దాడిలో ఆయన మరణించారు. స్థానిక ఫోటో జర్నలిస్ట్‌ ముసాబ్‌ అషౌర్‌, అల్‌ అక్సా రేడియోలో పనిచేసే వ్యక్తి అబ్దుల్‌హమిద్‌ అవద్‌, అల్‌ అక్సా టెలివిజన్‌ ఛానెల్‌కి చెందిన అమర్‌ అబు హయ్యాలు మరణించారు. 

మృతుల్లో ప్రెస్‌ హౌస్‌ డైరెక్టర్‌ బిలాల్‌ జదల్లా కూడా ఉన్నారు. గాజా సిటీలోని ఆయన కారుపై బాంబులు వేసినట్లు హమాస్‌ కమ్యూనికేషన్స్‌ ఆఫీస్‌ తెలిపింది. ఈ చర్యలు జర్నలిస్టులపై ఇజ్రాయిల్‌ వ్యూహాత్మక, లక్షిత దాడులను వివరించాయని పేర్కొంది.  గాజాపై ఇజ్రాయిల్‌ దాష్టీకాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న జర్నలిస్టులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. బాంబు దాడులతో పాటు కమ్యూనికేషన్‌ లేకపోవడం, అంతరాయం, విద్యుత్‌ కొరత వంటివి ఉన్నాయని వెల్లడించింది.