ప్రపంచవ్యాప్తంగా 43 శాతం పెరిగిన మీజిల్స్‌ మరణాలు

ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్‌తో మరణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వ్యాక్సిన్ల రేట్లు తగ్గుతున్నప్పటికీ 2021-22లో మరణాల రేటు 43 శాతం పెరిగినట్లు ఓ నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) మరియు అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సిడిసి) ఈ నివేదికను విడుదల చేశాయి. 

2021లో 22 దేశాలకు మాత్రమే పరిమితమవగా, 2022లో 37 దేశాలకు మీజిల్స్‌ వ్యాధి వ్యాప్తి చెందినట్లు నివేదిక తెలిపింది.   ఆఫ్రికాలోని డబ్ల్యుహెచ్‌ఒ పరిధిలోకి వచ్చే 28దేశాలు, తూర్పు మధ్యధరా ప్రాంతం, రెండు ఆగ్నేయాసియా దేశాలు, యూరోపియన్‌ ప్రాంతంలో ఒక దేశం ఉన్నట్లు డబ్ల్యుహెచ్‌ఒ వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా మీజిల్స్‌ వ్యాధి వ్యాప్తి, మరణాలు పెరుగుతున్నప్పటికీ.. దురదృష్టవశాత్తు గత కొన్నేళ్లుగా ఊహించని రీతిలో వ్యాక్సిన్‌ రేట్లు తగ్గుతున్నాయని సిడిసికి చెందిన గ్లోబల్‌ ఇమ్యూనైజేషన్‌ డివిజన్‌ డైరెక్టర్‌ జాన్‌ వెర్టెఫియల్లె తెలిపారు. టీకాలు వేయించని కమ్యూనిటీలు, దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి అధికమయ్యే ప్రమాదం ఉందని, తక్షణమే వ్యాధిని అడ్డుకునే చర్యలు చేపట్టాలని అన్నారు.

వైరస్‌ ద్వారా వచ్చే ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస, దగ్గు, తుమ్ము ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి తీవ్రమై మరణానికి కూడా దారితీయవచ్చు. రెండు డోసుల వ్యాక్సిన్‌ ద్వారా ఈ వ్యాధిని అడ్డుకోవచ్చు.

2021 నుండి 22 మధ్య ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ.. ఇప్పటికీ 33 మిలియన్ల మంది చిన్నారులకు ఈ వ్యాక్సిన్‌ అందలేదని డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది. సుమారు 22 మిలియన్ల మంది మొదటి డోసు మిస్‌ కాగా, అదనంగా 11 లక్షల మంది రెండవ డోసును మిస్‌ చేసుకున్నట్లు వివరించింది. 

తక్కువ ఆదాయం కలిగిన దేశాలు ఈ వ్యాధి తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో 66 శాతం అత్యల్ప వ్యాక్సినేషన్‌ రేటు ఉందని, కొవిడ్‌ మహమ్మారి సమయంలో మరింత వెనుకబడినట్లు నివేదిక తెలిపింది. అయితే ఇప్పటికీ ఆ దేశాలు ఆ ప్రభావం నుండి కోలుకోలేదని స్పష్టం చేసింది.