టన్నెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆరు ప్రణాళికలు

ఉత్తరకాశి టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఆరు ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. నితిన్‌ గడ్కరీ, ఉత్తరఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామితో కలిసి సిల్కియారాకు ఆదివారం చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ పరిశీలించారు. 

సొరంగంలో చిక్కుకున్న వారిపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని కేంద్ర మంత్రి చెప్పారు.  వాటిని బయటకు తీసుకురావడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం పేర్కొన్నారు. ఇది విపత్తుతో యుద్ధమని చెబుతూ కార్మికులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పని చేస్తున్నాయని తెలిపారు. ఉత్తర కాశిలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, సొరంగంలోని కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆత్మస్థైర్యం చెక్కుచెదరకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గడ్కరీ తెలిపారు. 

టన్నెల నిర్మాణంలో నైపుణ్యం ఉన్న ప్రైవేటురంగ నిపుణులను కూడా పిలిపించారని తెలిపారు. సొరంగం ఎగువ, కుడి ఎడమల నుంచి డిల్లింగ్‌ ప్రారంభించినట్లు చెప్పారు. హిమాలయ ప్రాంతంలో నేల వైవిధ్యంగా ఉంటుందని, కొన్ని చోట్ల నేల మెత్తగానూ, మరికొన్ని చోట్ల రాళ్లు, గట్టి రాళ్లు ఉంటాయని వివరించారు.అగర్ మెషిన్‌తో డ్రిల్లింగ్ ప్రారంభమైందని, కొంత గట్టిగా ఉండడంతో డ్రిల్లింగ్‌ సాధ్యం కాలేదని తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రైల్వే, ఓఎన్‌జీసీ, ఐఐటీ నిపుణుల సహాయం తీసుకుంటామని చెప్పారు.

మెషిన్ వైబ్రేషన్‌తో మరిన్ని కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సొరంగంలో చిక్కుపడిన వర్కర్ల వద్దకు వేగంగా చేరుకోవడానికి అమెరికన్ ఆగర్ మిషన్ ద్వారా సమాంతరంగా డ్రిల్లింగ్ జరపడం అత్యంత వేగంగా జరిగే విధానమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ఏది ఏమయినా వీలయినంత త్వరగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడడమే తమ ప్రధమ ప్రాధాన్యత అని పేర్కొంటూ  దీనికోసం చేయవలసినదంతా చేస్తామని మంత్రి  భరోసా ఇచ్చారు. చిక్కుపడిన కార్మికులకు నిరంతరాయంగా ఆక్సిన్, విద్యుత్, ఆహారం, నీరు, మందులు పంపుతున్నట్లు కూడా ఆయన చెప్పారు.

సొరంగం మధ్య నుంచి ఒక్కసారిగా కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోందని గడ్కరీ పేర్కొన్నారు. 80 మీటర్ల వరకు ఉన్న టన్నెల్‌లో కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సాంకేతిక కారణాలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్రంతో పాటు కేంద్రం ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

గత వారం రోజులుగా సొరంగంలో చిక్కుపడిన 41 మంది కార్మికులకు మొదటి రోజునుంచి కూడా ఆహారం, మల్టీ విటమిన్లు, యాంటీ డిప్రెసన్లు, డ్రైఫ్రూట్లు పైప్‌లైన్ ద్వారా పంపిస్తున్నట్లు హైవేస్ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ కూడా చెప్పారు. అదృష్టవశాత్తు సొరంగం లోపల వెలుతురు, తాగునీరు వంటివి ఉన్నాయన్న ఆయన కార్మికులను కాపాడడానికి మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని తెలిపారు.