మాల్దీవుల నుండి భారత్ సైనికులను ఉపసంహరించుకోండి

తమ దేశంలో ఉన్న సైనికులను భారత్‌ ఉపసంహరించుకోవాలని మాల్దీవుల నూతన అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు స్పష్టం చేశారు. తమ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా బలమైన తీర్పునిచ్చారని, దానిని భారత్‌ గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా ముయిజ్జు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 
 
బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజుననే తన ప్రమాణస్వీకారం భారత ప్రతినిధిగా హాజరైన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు  ఆయనతో శనివారం మర్యాపూర్వకంగా భేటీ అయిన సందర్భంగా నేరుగా ఈ విషయాన్ని ముఖాముఖీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారత సైనికులను ఉపసంహించుకోవాలని కోరినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 
 
ఎన్నికల సందర్భంగా మాల్దీవుల నుంచి ఇండియన్‌ మిలిటరీని తిరిగి పంపిస్తామని ముయిజు అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన గెలుపు నేపథ్యంలో ఆ హామీని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.  అయితే హిందూ మహాసముద్రంలో కీలకమైన పొరుగుదేశం కావడంతోపాటు, అక్కడ అనేక మంది భారతీయులు నివసిస్తుండటం గురించి రిజిజు ప్రస్తావించారు. 
 
అందువల్ల నిర్మాణాత్మక సంబంధాలను పెంచుకునేందుకు, దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు. కాగా, హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో దానిని అడ్డుకోవడానికి భారత్ కు మాల్దీవులు చాలా అవసరం.  భౌగోళికంగా మాల్దీవులు అత్యంత కీలకమైన సముద్ర ప్రాంతంలో ఉన్నాయి.
ఈ దీవిలో ఇప్పుడు దాదాపు 70 మంది వరకూ భారతీయ సైనికులు ఉన్నారు. వీరు రాడార్ల నిర్వహణ, విమానాల నిఘా వంటి చర్యలకు దిగుతున్నారు. 
కాగా భారతీయ యుద్ధ విమానాలు మాల్దీవుల పూర్తిస్థాయి ఎకనామిక్ జోన్ల గస్తీలో అక్కడి సేనలకు సహకరిస్తున్నాయి. భారత సేనల ఉపసంహరణ డిమాండ్‌తో ఇప్పుడు కొత్త నేత ఆధ్వర్యంలో ఈ దేశం ఇక చైనా వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని వెల్లడైంది.