శబరిమల అయ్యప్ప దేవాలయానికి పోటెత్తిన భక్తులు

కేరళలోని ప్రసిద్ధి చెందిన శబరిమల అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకలు ప్రారంభమయ్యాయి. మండల మకరవిళక్కు పండగ సీజన్ ప్రారంభం కావడంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం కేరళ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని తెరిచారు. 
 
శుక్రవారం నుంచి స్వామివారికి మండల పూజ, మకర జ్యోతి కోసం దర్శనాలు మొదలుపెట్టారు. దీంతో శబరిమల క్షేత్రానికి భారీగా అయ్యప్ప భక్తులు చేరుకుంటున్నారు. శబరిమల అయ్యప్ప స్వామికి ఒక్క కేరళ రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు, మాలధారులు వస్తూ ఉంటారు. 
 
అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవడానికి అయ్యప్ప సన్నిధానం, పంబ వద్దకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి మండల పూజ డిసెంబర్ 27వ తేదీన జరగనున్న నేపథ్యంలో నేటి నుంచి ప్రత్యేక పూజలు స్వామివారికి నిత్యం నెయ్యితో అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

 
ఇక డిసెంబర్ 31వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం జనవరి 15వ తేదీ వరకు అయ్యప్ప స్వామి వారికి మకర జ్యోతి పూజలు కొనసాగుతాయి. మకర సంక్రాంతి రోజున సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మకర జ్యోతి దర్శనంతో వార్షిక ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకుంటాయి. అత్యంత ఘనంగా అయ్యప్ప వార్షిక వేడుకలు జరుగుతాయి.
 
అయ్యప్ప ఆలయానికి భక్తుల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు శబరిమల వద్ద ఆరు దశల్లో 13 వేల మంది పోలీసులను మోహరించారు. వృద్ధులు, చిన్నారులకు స్వామి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.  ఇక శబరిమల ఆలయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కేరళ దేవాదాయ శాఖ మంత్రి కే రాధాకృష్ణ కూడా వెల్లడించారు. ఇక అయ్యప్ప మాలధారులు శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకోవడంతో శబరిమలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
 
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేరళ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధునాతన సాంకేతికతతో భక్తుల రాకపోకలపై నిఘా ఉంచారు. అన్ని చోట్ల సిసిటివి కెమెరాలను అమర్చారు. 13 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు తాత్కాలిక పోలీస్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. 
 
ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వంటి దళాలను సైతం అందుబాటులో ఉంచారు. మరోవైపు, శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే దర్శించారు. 2024లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని తాను ప్రార్థించినట్లు శోభ తెలిపారు.