ఇక భారత్‌లోనే ఎల్‌ఏసీ మార్క్‌-2 ఫైటర్‌ జెట్‌ ఇంజిన్ల తయారీ

భారత్‌లో ఎల్‌ఏసీ మార్క్‌-2 ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ జెట్‌ ఇంజిన్ల తయారీకి మార్గం సుగమమైంది. జనరల్‌ ఎలక్ట్రిక్‌ సహకారంతో ఇకపై దేశంలో ఫైటర్‌ జెట్ల ఇంజిన్లు తయారీకి అమెరికా అన్ని అనుమతులు జారీ చేసింది. ఈ సందర్భంగా డీఆర్డీవో చైర్మన్‌ డాక్టర్‌ సమీర్‌ వీ కామత్‌ మాట్లాడుతూ ఎల్‌సీఏ మార్క్‌-2 ఇంజిన్లు స్వదేశీ అధునాతన మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లోని మొదటి రెండు స్క్వాడ్రన్‌లను అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ సహకారంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుందని తెలిపారు.

ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను అమెరికా పేర్కొన్నారు. జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా రక్షణ తయారీ రంగంలో ఇరు దేశాల మధ్య పలు ముఖ్యమైన ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా భారతీయ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో కలిసి అమెరికా కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లను తయారు చేయనుంది. 

జనరల్ ఎలక్ట్రిక్ సంయుక్తంగా యూఎస్‌ కాంగ్రెస్‌లో ఫైటర్ ఇంజిన్‌లను తయారు చేసేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం జనరల్ ఎలక్ట్రిక్ కు అనుమతులు ఇచ్చిందని డీఆర్డీవో చీఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహకారంతో జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్-414 జెట్ ఇంజిన్లను తయారీ చేయనున్నది. 

రెండు కంపెనీలు కలిసి భారతదేశంలో 99 ఇంజిన్లను తయారు చేయనున్నాయి. దీని ధర బిలియన్‌ డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. ఎల్‌సీఏ ఎంకే-2ను సిద్ధం చేయానికి హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌కు మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అంచనా.