కేరళ నర్స్ మ‌ర‌ణ‌శిక్ష‌ అప్పీల్‌ను కొట్టేసిన యెమెన్ కోర్టు

కేర‌ళ‌కు చెందిన న‌ర్సు నిమిషా ప్రియాకు యెమెన్‌లో మ‌ర‌ణ‌శిక్ష విధించారు. అయితే ఆ కేసును కొట్టివేయాల‌ని పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను ఆ దేశ సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. దేశ పౌరుడిని హ‌త్య చేసినందుకు ఆ మ‌ల‌యాళీ న‌ర్సుకు శిక్ష ఖ‌రారైంది. ఈ విష‌యం గురించి ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం విన్న‌వించింది.  నిమిషా ప్రియ‌కు ఇప్పుడు కేవ‌లం యెమెన్ దేశాధ్య‌క్షుడు మాత్ర‌మే క్ష‌మాభిక్ష పెట్ట‌గ‌ల‌ర‌ని కేంద్రం తెలిపింది.
యెమెన్‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ ప్రియ త‌ల్లి ప్రేమ మేరీ అభ్య‌ర్థ‌న పెట్టుకున్నారు. దీనిపై ప్ర‌భుత్వ అధికారులు వారంలోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని హైకోర్టు త‌న తీర్పులో ఆదేశించింది.  కేరళలోని పాలక్కడ్‌కు చెందిన నిమిషా ప్రియ గతంలో యెమెన్‌కు వెళ్లారు. అయితే యెమెన్ దేశస్థుడైన తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో నిమిషా ప్రియ దోషిగా తేలింది.
దీంతో ఆమెను ఈ కేసు నుంచి బయటపడేసి జైలు నుంచి విడుదల చేయించేందుకు నిమిషా ప్రియ తల్లి హత్యకు గురైన తలాల్ అబ్దో మహదీ కుటుంబ సభ్యులతో చర్చలు జరపాలని యోచిస్తున్నారు.  అయితే 2022 లో మృతుడి కుటుంబానికి డబ్బులు చెల్లించి నిమిషా ప్రియను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించినా ఆ తర్వాత ఎలాంటి పురోగతి కనిపించ లేదు.
ఈ క్రమంలోనే తాజాగా యెమెన్ సుప్రీంకోర్టులో నిమిషా ప్రియకు చుక్కెదురు కావడంతో ఆమె తల్లి, ఆమె కోసం ఏర్పడిన సమిష్టి సేవ్ నిమిషా ప్రియా ఫోరమ్ సభ్యులు మధ్యవర్తిత్వం కోసం యెమెన్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. గతంలో యెమెన్‌కు వెళ్లిన నిమిషా ప్రియ కుటుంబం 2014 లో వెనక్కి రావాలని భావించింది. ఈ క్రమంలోనే ఆమె భ‌ర్త‌, కుమార్తె 2014 లో భారత్‌కు తిరిగి రాగా, ఉద్యోగం కారణంగా నిమిషా ప్రియ వెన‌క్కి రాలేదు. అయితే ఈ క్రమంలోనే మ‌హ‌దితో కలిసి 2015 లో ఒక క్లినిక్‌ను ప్రారంభించింది. 
 
ఆ తర్వాత కొన్ని రోజులకే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ప్రారంభమైంది. దీంతో నిమిషా ప్రియ పాస్‌పోర్టును లాగేసుకున్న మ‌హది ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. దీంతో 2015 జూలై 25 వ తేదీన మ‌హ‌దిని ప్రియా అనుకోకుండా చంపేసింది. ఈ కేసులో మ‌రో వ్యక్తి కూడా నిందితుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తికి జీవిత ఖైదు పడింది. మహదీ తనను తీవ్ర దుర్భాషలాడాడని, హింసించాడని విచారణ సందర్భంగా నిమిషా ప్రియ ఆరోపించింది.