చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

స్కిల్‌ డెలప్ మెంట్ స్కాం కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన రెగ్యూలర్ బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు గురువారం ముగిశాయి. సీఐడీ తరపున వాదనలు ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించగా, చంద్రబాబు తరపు వాదనలు సిద్ధార్ధ్ లూథ్రా వాదించారు. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును తీర్పు రిజర్వ్‌ చేసింది.

చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపిస్తూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసులో 2018 నుంచి విచారణ జరుగుతుంటే ఇప్పుడు ఇంత హడావుడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రస్తావించారు. చంద్రబాబును ఇరికించడం కోసమే ఇదంతా చేశారని పేర్కొన్నారు. చంద్రబాబుకు వెంటనే బెయిల్ ఇవ్వాలని కోరారు.

సీఐడీ తరపున హైకోర్టులో ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపిస్తూ చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని, చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అన్న పొన్నవోలు ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలని వాదించారు. 

కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు రూ. 10 నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్‌కు తరలించారని, బోస్‌ అనే వ్యక్తి ఫోన్‌ మెస్సేజ్‌ల ద్వారా ఈ విషయం బయటపడిందని వివరించారు.  సీమెన్స్‌ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారని, చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారని చెప్పారు.

చీఫ్‌ సెక్రటరీ తన లెటర్‌లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్‌ సెక్రటరీకి లేఖ రాశారని వాదించారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపు వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పటికే అనారోగ్య కారణాల రీత్యా ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే.