చంద్రబాబుకు ‘గుండె’ సమస్య.. 3 నెలలు చికిత్స అవసరం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు  స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ సందర్భంగా ఆయన న్యాయవాదులు సమర్పించిన నివేదికలో తెలిపారు.  చంద్రబాబు గుండె పరిణామం పెరిగిందని, గుండెకు రక్తం సరఫరా చేసే రక్త నాళాల్లో సమస్యలున్నాయని పేర్కొన్నారు. బాబుకు తగినంత విశ్రాంతి అవసరమని సూచించారు. షుగర్‌ను అదుపులో ఉంచి, జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ఎఐజి హాస్పిటల్స్ లో ఇటీవల జరిపిన చికిత్స, వైద్య పరీక్షలకు సంబంధించి వైద్యులు ఇచ్చిన నివేదికను హైకోర్టులో బుధవారం సమర్పించారు. బాబు కుడి కంటికి ఆపరేషన్ నిర్వహించగా కోలుకునేందుకు సమయం పడుతుందని సూచించారు. 5 వారాల పాటు కంటి చెకప్ కోసం షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఈ 5 వారాల పాటు ఇన్‍ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవటంతో పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలని వైద్యులు ఆ నివేదికలో సూచించారు.
‘‘కుడి కంటికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. చంద్రబాబు అనారోగ్యం నుంచి కోలుకునేందుకు మందులు వాడాలి. ఐదు వారాలపాటు వైద్యులు ఐ చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చారు. కంటికి ఐదు వారాల పాటు ఇన్‍ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. ఐదు వారాల పాటు చంద్రబాబు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలి” అని తెలిపారు.  “గుండె సంబంధిత సమస్యతో చంద్రబాబు బాధపడుతున్నారు. గుండె పరిణామం పెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాలాల్లో సమస్యలున్నాయి. చంద్రబాబుకు తగినంత విశ్రాంతి అవసరం. మధుమేహన్ని అదుపులో ఉంచి.. జాగ్రత్తలు పాటించాలి” అని వైద్యులు సూచించారు.
కాగా, స్కిన్ ఎలర్జీకు సంబంధించి కూడా చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ బాబుకు ఎలర్జీ పెరిగిందని వైద్యులు పేర్కొన్నారు. చంద్రబాబు కాన్వాయ్‌లో, 24 గంటల పాటు అంబులెన్స్‌లో ట్రెయిన్డ్ డాక్టర్ ఉండాలని వైద్యులు సూచించారు.  సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, మిగిలిన వాదనలు వింటామని విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.